Chandrababu: యురేనియం తవ్వకాలకు అనుమతి లేదన్న సీఎం చంద్రబాబు.. బోర్లు నిలిపివేయాలంటూ ఆదేశాలు
కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం, కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు సంబంధించి బోర్లు వేసే ప్రతిపాదనను ఆపాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను జారీ చేశారు. ఈ నిర్ణయం ఆ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఎందుకంటే యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా వారు కొద్దిరోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 2023 జూన్‌లో వైసీపీ ప్రభుత్వం హయాంలో మొదటి దశ అనుమతులు మంజూరయ్యాయి. ఈ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలున్నాయన్న నిర్ధారణ తర్వాత, మరింత లోతైన పరిశోధన కోసం కేంద్ర ప్రభుత్వ 'ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్' (ఏఎండీ) 468.25 హెక్టార్లలో 68 బోర్ హోల్స్ వేసే ప్రతిపాదనను పంపించింది.
అధికారికంగా ప్రకటించిన కర్నూలు జిల్లా కలెక్టర్
అయితే ఈ తవ్వకాలు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నిర్ణయంపై వ్యతిరేక ప్రచారం కొనసాగుతుండగా, కొందరు వైసీపీ నాయకులు టీడీపీ ప్రభుత్వమే తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందని ఆరోపణలు చేసింది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి టీజీ భరత్ సహా పలువురు ఎమ్మెల్యేలు వివరించారు. దీనిపై సీఎం తక్షణమే స్పందించి, భవిష్యత్తులోనూ యురేనియం తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో, రాష్ట్రం నుంచి అనుమతులు లేకపోవడం వల్ల తదుపరి తవ్వకాలకు చెక్ పడింది. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.