LOADING...
CM Chandrababu: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం ఫోకస్‌.. ఈ నెలలోనే పోలవరం, వెలిగొండతో పాటు ఉత్తరాంధ్రకు చంద్రబాబు 
ఈ నెలలోనే పోలవరం, వెలిగొండతో పాటు ఉత్తరాంధ్రకు చంద్రబాబు

CM Chandrababu: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం ఫోకస్‌.. ఈ నెలలోనే పోలవరం, వెలిగొండతో పాటు ఉత్తరాంధ్రకు చంద్రబాబు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. పోలవరం, వెలిగొండతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పలు ప్రాజెక్టులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆయన నిర్ణయించారు. నిర్ణయించిన గడువులోగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యేలా పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు గురువారం సమాచారం అందింది. జనవరి తొలి వారంలోనే ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. 2027 డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. గోదావరి పుష్కరాలు 2027 జూన్‌ చివరి వారంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, అదే సమయంలో ఖరీఫ్‌ సీజన్‌ కూడా మొదలవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు.

వివరాలు 

కీలక దశకు పోలవరం ప్రాజెక్టులో కాఫర్‌ డ్యాం పనులు

అప్పటికి పోలవరం పూర్తయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. తొలి విడత నిధులతో పాటు అడ్వాన్సుగా నిధులు మంజూరు చేస్తామని కేంద్రం అంగీకరించిన సమయంలోనే పనుల గడువును కూడా నిర్దేశించింది. పోలవరం ప్రాజెక్టులో కాఫర్‌ డ్యాం పనులు ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నాయి. గ్యాప్‌-1 వద్ద ప్రధాన డ్యాం పనులు ప్రారంభమయ్యాయి. అలాగే గ్యాప్‌-2 పనులు కూడా కొనసాగుతున్నాయి. డయాఫ్రం వాల్‌పై ప్రధాన డ్యాం నిర్మాణం మొదలైంది. దీనితో పాటు కుడి, ఎడమ కాలువలను అనుసంధానించే పనులు వేగంగా సాగుతున్నాయి. 2027 ఖరీఫ్‌ నాటికి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సాధ్యమయ్యే అవకాశాలు, పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించనున్నారు.

వివరాలు 

పోలవరం వద్ద ప్రతిపాదించిన పర్యాటక ప్రాజెక్టులపై సమీక్ష 

పోలవరం ఎడమ కాలువ పనులను జనవరి చివరి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పోలవరం వద్ద ప్రతిపాదించిన పర్యాటక ప్రాజెక్టులపై కూడా సీఎం సమీక్ష చేయనున్నారు. ఈ ఏడాదే పోలవరం నీటి నిర్వహణ విధానానికి సంబంధించిన ముసాయిదాను విడుదల చేయనున్నారు. జలాశయాల్లో ప్రస్తుతం 80శాతానికి మించి నీటి నిల్వలు అందుబాటులో ఉండటంతో అన్ని ప్రాంతాల్లో చెరువులు నింపే పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నీరు సమృద్ధిగా ఉండటంతో ఖరీఫ్‌ సాగును ముందుగానే ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. భూగర్భజలాలు పెంచే కార్యక్రమాలను గ్రామాల వారీగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ నీటి విధానంపై ముసాయిదాతో పాటు పారిశ్రామిక,తాగునీరు, సాగునీటి విడుదలకు సంబంధించిన ప్రణాళికను కూడా విడుదల చేయనున్నారు.

Advertisement

వివరాలు 

వెలిగొండకు 7 లేదా 9న సీఎం పర్యటన 

వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 7 లేదా 9 తేదీల్లో ముఖ్యమంత్రి సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జులై నాటికి వెలిగొండ నుంచి నల్లమలసాగర్‌కు నీటిని మళ్లించి,తొలి దశలో 1,19,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి. రెండు టన్నెళ్లలో బెంచింగ్‌, లైనింగ్‌ పనులను పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. నీటి విడుదల సాధ్యమవ్వాలంటే హెడ్‌ రెగ్యులేటర్ల వద్ద రిటైనింగ్‌ వాల్‌, వింగ్స్‌, రిటర్న్‌ల నిర్మాణాన్ని పూర్తిచేయాల్సి ఉంది. తొలి టన్నెల్‌లో 15 మీటర్ల మేర లైనింగ్‌ పనులు,రెండో టన్నెల్‌లో 361మీటర్ల బెంచింగ్‌ తవ్వకంతో పాటు 3,686మీటర్ల లైనింగ్‌ చేయాల్సి ఉంది. ఫీడర్‌ కాలువలో పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేయాలి.అక్కడ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం ప్రారంభమైంది.

Advertisement

వివరాలు 

తీగలేరు కాలువకు హెడ్‌ రెగ్యులేటర్ల నిర్మాణం

తీగలేరు కాలువకు హెడ్‌ రెగ్యులేటర్ల నిర్మాణం కొనసాగుతోంది. పునరావాస పనులను కూడా పూర్తిచేయాల్సి ఉంది. నల్లమలసాగర్ పరిధిలోని గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉండగా, ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు సుమారు రూ.500 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యమంత్రి ఈ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన మార్గదర్శనం ఇవ్వనున్నారు.

వివరాలు 

17న ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సమీక్ష 

ఈ నెల 17న ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. అయితే ఆయన ఏయే ప్రాజెక్టులను సందర్శిస్తారన్నది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ ప్రాంతంలో రూ.2,087 కోట్ల వ్యయంతో 9 ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చని జలవనరుల శాఖ అంచనా వేసింది. వీటి ద్వారా కొత్తగా 1.24 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుండగా, మరో 2.48 లక్షల ఎకరాలకు స్థిరీకరణ లభించనుంది. నేరడి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందుకు అనుకూలంగా వంశధార ట్రైబ్యునల్‌కు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతోంది.

Advertisement