నిమ్స్ ఆస్పత్రికి మహర్ధశ.. విస్తరణకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిమ్స్ ఆస్పత్రిని విస్తరించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుబంధ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఈ ఆస్పత్రి కొత్త ప్రాంగణానికి దశాబ్ధి బ్లాక్‌గా నామకరణం చేశారు. ప్రస్తుత నిమ్స్ భవనం సరిపోవడం లేదనే నేపథ్యంలో మరో 2 వేల పడకలతో నూతన బ్లాక్‌ను కట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ఈ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చాక దేశంలోనే అత్యధిక బెడ్లతో నిర్మాణమైన అతిపెద్ద ఆస్పత్రుల జాబితాలో ప్రథమ స్థానం దక్కించుకోనుంది.
2014 -2021 కాలంలో దాదాపు రూ. 90 కోట్ల విలువైన పరికరాలను నిమ్స్ కొనుగోలు చేసింది. ఈ మేరకు 2022లో మరో రూ.153 కోట్ల పరికరాలను కొనేందుకు ఇప్పటికే ఆర్డర్ ఖరారైంది.
DETAILS
నిమ్స్ లో పెరిగిన రెసిడెంట్ డాక్టర్లు, టీచింగ్ స్టాఫ్ సంఖ్య
నిమ్స్ కు 2014-15లో 185 కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం, 2022లో రూ. 242 కోట్ల మేర నిధులు అందించింది. అయితే ప్రస్తుత ఏడాది 2023లో కాస్త పెంచుతూ దాదాపు రూ.290 కోట్లు కేటాయించడం గమనార్హం.
2014 నాటికి 900 బెడ్లతో ఉన్న నిమ్స్ ను కాలక్రమంలో 1489 సంఖ్యకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజాగా కొత్త బ్లాక్ లో 2000 పడకల నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. 2014 నాటికి కేవలం 111 మంది టీచింగ్ స్టాప్ మాత్రమే ఉండగా, గతేడాది అదనంగా 150 మందిని నియమించారు.
ఈ మేరకు బోధనా సిబ్బంది సంఖ్య 261కు చేరుకుంది. రెసిడెంట్ వైద్యుల సంఖ్యను సైతం పెంచడంతో ప్రస్తుతం 169 మంది కొనసాగుతున్నారు.