Page Loader
Delhi Budget 2025: రూ.లక్ష కోట్లతో ఢిల్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేఖాగుప్తా
రూ.లక్ష కోట్లతో ఢిల్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేఖాగుప్తా

Delhi Budget 2025: రూ.లక్ష కోట్లతో ఢిల్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేఖాగుప్తా

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2025
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో బీజేపీ ప్రభుత్వం తొలి ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా రూ. లక్ష కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నట్లు ప్రకటించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని "మహిళా సమ్మాన్ యోజన" పేరుతో అమలు చేయనున్నారు. ఈ పథకానికి మొత్తం రూ.5,100 కోట్లు కేటాయించారు. అర్హులైన ప్రతి మహిళకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేస్తామని రేఖా గుప్తా వెల్లడించారు.

వివరాలు 

10 కీలక రంగాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత

26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలు గెలుచుకున్నాయి. విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి 10 కీలక రంగాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం రూ. లక్ష కోట్లతో రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్ చారిత్రాత్మకమైనది అని సీఎం రేఖా గుప్తా అభివర్ణించారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మెరుగైన రవాణా కనెక్టివిటీ కోసం రూ.1,000 కోట్లు కేటాయించారు. మహిళల భద్రతను పెంపొందించేందుకు 50,000 సీసీటీవీ కెమెరాలను నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

వివరాలు 

మీరు శీష్‌మహల్‌ కట్టుకుంటే.. మేం పేదల ఇళ్లు కడుతున్నాం: సీఎం 

యమునా నది,మురుగు నీటి శుద్ధికి రూ.9,000 కోట్లు కేటాయించారు.నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి నీటి ట్యాంకర్లకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ప్రవేశపెడతామని వెల్లడించారు. ఆరోగ్య రంగానికి రూ.6,874 కోట్లు కేటాయించారు.గత ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలతో విభేదాలను పెంచినప్పటికీ,తమ ప్రభుత్వం అందరితో కలిసికట్టుగా పని చేస్తుందని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనకు,బీజేపీ ప్రభుత్వానికి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుందని రేఖా గుప్తా వ్యాఖ్యానించారు. "ఆప్ వాగ్దానాలు ఇస్తుంది,కానీ అమలు చేయదు.కానీ మేము హామీలు ఇస్తే తప్పకుండా అమలు చేస్తాం"అని పేర్కొన్నారు. "వాళ్లు శీష్ మహల్ నిర్మించుకుంటారు,మేము పేదలకు ఇళ్లు కట్టిస్తాం.వాళ్లు లక్షల రూపాయల విలువైన మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకుంటారు,కానీ మేము మురికివాడ ప్రజలకు మరుగుదొడ్లు నిర్మిస్తాం" అంటూ ఆమె విమర్శించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిల్లీ సీఎం