CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 35,000 ఉద్యోగాల భర్తీ త్వరలో జరగబోతుందని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా, యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన 135 మంది అభ్యర్థులకు ₹1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. సచివాలయం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు వివరించారు. సివిల్స్ ఉత్తీర్ణులైన వారు రాష్ట్ర ప్రతిష్టను పెంచి, అధిక సంఖ్యలో సివిల్ సర్వెంట్లుగా ఎంపిక కావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే, మెయిన్స్‌లో పాస్ అయ్యి ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి కూడా ₹1 లక్ష ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
'20 వేల మందికి శిక్షణ'
ఈ సందర్భంగా,విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు,వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2,000 మందికి శిక్షణ అందిస్తామన్నారు.వచ్చే ఏడాది నుంచి ఈ సంఖ్యను 20,000కు పెంచుతామని చెప్పారు. అంతేకాక, యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేయాలని, 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధిక పతకాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 25-30 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని, గత ప్రభుత్వాలు వర్సిటీలను నిర్వీర్యం చేశాయని, త్వరలో అన్ని వర్సిటీలకు నూతన వైస్ ఛాన్సలర్లను నియమిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు.