Revanth Reddy: హెల్త్, కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేయాలని ఆదేశాలను జారీ చేశారు. ఇకపై ఈ రెండు కార్డులు వేర్వేరు ప్రక్రియల ద్వారా జారీ చేస్తామని, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబం నుండి వివరాలను సేకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి అనుసరించాల్సిన పద్దతులను పరిశీలించి, ప్రతి వ్యక్తి ఆరోగ్య ప్రొఫైల్ను నమోదు చేసేందుకు అవసరమైన వైద్య పరీక్షలు చేపట్టాలని సూచించారు. డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే చర్యలు ముమ్మరం చేయాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఫాగింగ్ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, అలసత్వం వహిస్తే ఉద్యోగులను సస్పెండ్ చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తూ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు.