CM Revanth Reddy: రేషన్ కోటా పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త రేషన్ కార్డుల పంపిణీ నేపథ్యంలో,రాష్ట్రానికి అవసరమైన కోటాను పెంచాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
ఢిల్లీ పర్యటనలో భాగంగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు.
సుమారు అరగంట పాటు జరిగిన ఈ చర్చల్లో,2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి ఇంకా రావాల్సిన రూ.1,468.94 కోట్ల ధాన్యం బకాయిలను విడుదల చేయాలని సీఎం వినతిపత్రం సమర్పించారు.
అదనంగా,ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (PM Garib Kalyan Yojana) కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి రూ. 343.27 కోట్ల బకాయిలను విడుదల చేయాలని, అలాగే సీఎంఆర్ (CMR) డెలివరీ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
వివరాలు
కొత్త రేషన్ కార్డులపై చర్చ
అయితే, ఈ సమావేశం పూర్తి స్థాయిలో సాగలేదు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మరో అపాయింట్‌మెంట్ ఉండటంతో, ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు సీఎం మళ్లీ కేంద్రమంత్రితో సమావేశం కానున్నారు.
గత దశాబ్దంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో, కొత్త కార్డుల పంపిణీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ రూపొందిస్తోంది.
ఎన్నికల నియమావళి (Election Code) ముగియనుండటంతో, ప్రభుత్వం ఈ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని భావిస్తోంది.
రాబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చలు జరుగనున్నట్లు తెలుస్తోంది.
ఇదే సందర్భంలో, రేషన్ కోటాను పెంచాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరినట్లు సమాచారం.