AP Sand Policy : ఇసుక కొరతపై సీఎం కీలక ఆదేశాలు.. ఏపీలో నూతనంగా 108 ఇసుక రీచ్‌లు
ప్రజల డిమాండ్‌కు తగిన రీతిలో ఇసుక సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం గనులు, భూగర్భ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 16 నుంచి 108 కొత్త ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ఈ రీచ్‌లు రోజుకు 80,000 మెట్రిక్ టన్నుల ఇసుకను అందించే సామర్థ్యంతో ఉంటాయని ఆయన తెలిపారు. మొత్తం 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వల సామర్థ్యం ఉందని వెల్లడించారు. ఈ రీచ్‌ల వద్ద నేరుగా బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించాలని, చెకింగ్, GPS ట్రాకింగ్, ఆడిట్ ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించాలని అధికారులకు సూచించారు.
ఆన్ లైన్ ద్వారా బుకింగ్
ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా బుకింగ్ ప్రక్రియ సులభతరం చేయడంపై కూడా ఆయన దృష్టి పెట్టారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఇసుక పాలసీపై విమర్శలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పాలసీకి కొద్దిరోజుల్లోనే కూటమి ప్రభుత్వం మార్పులు చేసింది. వర్షాకాలం కారణంగా ఇసుక ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. భవన నిర్మాణ రంగం కూడా ఇసుక కొరత వల్ల తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కొత్త రీచ్‌ల అమలుతో ఈ సమస్యలు కొంతవరకు తగ్గుతాయని ఆశిస్తున్నారు. ఇసుక కొరతను సమర్థంగా పరిష్కరించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.