Dasara: మైసూరులో తొమ్మిది రోజులపాటు దసరా సంబరాలు.. ఉత్సవాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక పర్యాటక రంగానికి కీలకమైన మైసూరు నగరం గురువారం మరోసారి రంగుల దసరా ఉత్సవాలను ఘనంగా ప్రారంభించింది.
ఈ వేడుకలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తన మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రారంభించారు.
జిల్లా నగరాభివృద్ధి సంస్థ భూముల అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్నా, ఉత్సవాలపై వాటి ప్రభావం పడకుండా జాగ్రత్తపడ్డారు.
ఈ సంవత్సరం వేడుకలు మరింత ఆడంబరంగా జరగాలని అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రుల సూచనలతో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి హెచ్.సి. మహదేవప్ప, సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగితో కలిసి అన్ని ఏర్పాట్లను చేశారు.
గత ఏడాది ప్రారంభించిన గృహలక్ష్మి పథకం తొలిచెక్‌ను చాముండేశ్వరి దేవికి సమర్పించి ప్రారంభోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు.
వివరాలు
మాట నెరవేర్చాం
ఉత్సవాల్లో క్రీడలు, కుస్తీ, పుస్తక, సాంస్కృతిక, గాన, కళా, యోగా, ఆహార, చలనచిత్ర ప్రదర్శనలు వంటి అనేక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ సంవత్సరం ప్రత్యేక అతిథిగా ప్రముఖ జైన సాహితీవేత్త హంప నాగరాజయ్యను ఎంపిక చేసి, ఆయన చేతుల మీదుగా చాముండేశ్వరి అమ్మవారికి పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు.
గ్యారంటీ పథకాల అమలుతో రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరిచామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సందర్భంగా ప్రకటించారు.
గృహలక్ష్మి,గృహజ్యోతి వంటి పథకాలతో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని తెలిపారు.
రాష్ట్రంలో మంచి వర్షాలు కురవడం, ముంగారు పంటకు 99 శాతం విత్తనాలు నాటడం జరిగినట్లు వివరించారు.
ప్రజల ఉత్సాహంతో ఈ దసరా వేడుకలు మరింత విజయవంతం కావాలని పేర్కొన్నారు.
వివరాలు
యుద్ధ కాంక్ష ఏల?
సాహితీవేత్త హంప నాగరాజయ్య దసరా ఉత్సవాలను ప్రారంభిస్తూ, ఇజ్రాయెల్-పాలస్తీనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలను ఆపాలని, లక్షలాది అమాయకుల ఇక్కట్లు తీర్చాలని చాముండేశ్వరిని ప్రార్థించినట్లు వెల్లడించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ సామాన్యుడు దసరా ఉత్సవాలను ప్రారంభించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఆయన విపక్షాలను ఉద్దేశించి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు ఇకనైనా ఆగాలని సూచించారు.
అలాగే, ఇన్నేళ్లుగా శాసనసభల్లో మహిళల ప్రాధాన్యత పెరగకపోవడం గురించి ఆవేదన వ్యక్తం చేశారు.
స్త్రీభ్రూణ హత్యలు, నిరుద్యోగం, రాజకీయ ద్వేషాలు, పరస్పర నిందలు యువతకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ విధానాలను మానుకోవాలని పిలుపునిచ్చారు.