Cyclone Michaung: నేడు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచౌంగ్ తుపాను.. చెన్నైలో 5గురి మృతి
బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చడంతో మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య మిచౌంగ్ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. వాతావరణ వ్యవస్థ కారణంగా గత రెండు గంటల్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడులో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. చెన్నైలో, మిచౌంగ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడడంతో రోడ్లు నదులుగా మారాయి,వాహనాలు కొట్టుకుపోవడంతో సోమవారం అధికారులు విద్యాసంస్థలను మూసివేశారు. పరిస్థితి చక్కబడే వరకు ఇంటి నుంచే పని చెయ్యాలని ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా చెట్లు, గోడలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తమిళనాడు రాజధానిలో వర్షాల కారణంగా ఐదుగురు మరణించారు.
తుఫాను కారణంగా రవాణా సేవలకు విఘాతం
వరదనీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి ప్రవేశించడంతో ఆరోగ్య సేవలను తాత్కాలికంగా నిలిపివేసారు. మెట్రో స్టేషన్లలో కూడా వర్షం నీటితో నిండిపోయాయి. వరద నీటిలో రోడ్డును దాటుతున్న మొసలి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్తు,ఇంటర్నెట్ కు అంతరాయం ఏర్పడింది. తుఫాను కారణంగా అనేక రైళ్లు, విమానాలు రద్దు చేయడంతో రవాణా సేవలకు విఘాతం కలిగింది. మంగళవారం ఉదయం 9 గంటల వరకు విమానాలు అందుబాటులో లేకపోవడంతో చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.