Weather Update : తెలంగాణలో చలి విజృంభణ.. వచ్చే పది రోజులు అలర్ట్.. హైదరాబాద్‌లోనూ పరిస్థితి ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో చలి మరింత వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉదయం, సాయంత్రం సమయంలో చలికాలం పంజా విసురుతుండగా, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే పది రోజులు రాష్ట్రంలో చలితీవ్రత గణనీయంగా పెరిగి, కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత క్షీణించే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ఇప్పటికే వికృతరూపం దాల్చింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, అదిలాబాద్ ప్రాంతాల్లో 10 డిగ్రీల చుట్టూ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, సిర్పూర్‌లో 10.4 డిగ్రీలు, అదిలాబాద్ జిల్లా సాత్నాలలో 10.8 డిగ్రీలు రికార్డ్ అయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 12.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Details
ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే ప్రమాదం
కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో కూడా 13 నుంచి 13.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, వచ్చే పది రోజుల్లో రాత్రిపూట చలి మరింత తీవ్రమై, రాష్ట్రంలో 'సెకండ్ ఫేజ్ కోల్డ్‌వేవ్' పరిస్థితులు కొనసాగనున్నాయి. ఈనెల 7 నుంచి 17 వరకు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లోనే నమోదయ్యే అవకాశముందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొదటగా ఉత్తర తెలంగాణలో తీవ్ర చలి ప్రభావం ఉంటుందని, తర్వాత హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో కూడా చలి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Details
పదిరోజులపాటు తీవ్రమైన చలిగాలులు
హైదరాబాద్ నగరంలో ఆదివారం నుంచి సుమారు పదిరోజులపాటు తీవ్రమైన చలిగాలులు వీచి, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5-8 డిగ్రీల వరకు పడిపోవచ్చని అంచనా. ముఖ్యంగా చేవెళ్ల, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో 5-8 డిగ్రీలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా హెచ్సీయూ, శేరిలింగంపల్లి, నానకరాందుగూడ వంటి ప్రాంతాల్లో 6 నుండి 8 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.