
Karnataka: వ్యాక్సిన్‌పై వ్యాఖ్యలు తప్పు.. క్షమాపణ చెప్పాలి: సిద్ధరామయ్యపై బీజేపీ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని హసన్ జిల్లాలో గుండెపోటుతో జరిగిన మరణాలకు కొవిడ్ వ్యాక్సినే కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణుల బృందం తేల్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇటీవల హసన్‌లో 20 మంది హృదయసంబంధిత సమస్యలతో మృతిచెందిన ఘటనపై సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేస్తూ, కోవిడ్ వ్యాక్సిన్‌పై సందేహాలు ప్రదర్శించారు. దీంతో ఈ మరణాలపై విచారణ జరిపేందుకు ఆయన ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించారు. అయితే ఈ కమిటీ నివేదిక ప్రకారం.. గుండెపోటుకు గల కారణాలు జన్యు, మానసిక ఒత్తిడి, పర్యావరణ అంశాలని తేలింది. కొవిడ్ వ్యాక్సిన్ వల్ల గుండెపోటు వచ్చిందని నిరూపించేందుకు ఎలాంటి సాంకేతిక ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
Details
మండిపడుతున్న బీజేపీ నాయకులు
ఈ నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హుబ్బళిలో మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సిన్‌కు హృదయ సమస్యలకు సంబంధం లేదని ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీ, ఎయిమ్స్ వంటి ప్రముఖ వైద్య సంస్థలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇప్పుడు జయదేవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ నిపుణులు ఇచ్చిన నివేదిక కూడా అదే విషయాన్ని చెబుతోంది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని అన్నారు. జోషి ఆరోపిస్తూ, "ప్రధాని మోదీ హయాంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను కాంగ్రెస్ నేతలు అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తున్నారు.
Details
కాంగ్రెస్ జీర్ణించుకోలేక విమర్శలు చేస్తోంది
కరోనా సమయంలో తీసుకున్న చర్యలకు ప్రపంచం నరేంద్ర మోదీకి ప్రశంసలు కురిపించింది. అదే కాంగ్రెస్ జీర్ణించుకోలేక ఇలాంటి విమర్శలు చేస్తోందని పేర్కొన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి అశ్వత్ నారాయణ్ కూడా సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "భారతీయ శాస్త్రవేత్తలపై, దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై ప్రజల్లో అపోహలు కలిగించేలా సిద్ధరామయ్య వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.