Page Loader
ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

వ్రాసిన వారు Stalin
Apr 27, 2023
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని విషసర్పంతో పోల్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడగ్‌లో జరిగిన ర్యాలీలో ఖర్గే మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని నాశనం చేశారని అన్నారు. బీజేపీ సిద్ధాంతం, ఆలోచనా విధానం హేయమైనదని, అది దేశాన్ని సర్వ నాశనం చేసినట్లు దుయ్యబట్టారు. ప్రధాని మోదీ విషసర్పం లాంటి వారని, అది విషపూరితమైనదా? కాదా? అని పరీక్షించడానికి పట్టుకుంటే ఆ పాము కాటుకు చచ్చిపోతారని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల తర్వాత కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. విషసర్పం అని తాను మోదీని అనలేదని, బీజేపీ సిద్ధాంతాన్ని అన్నట్లు ఖర్గే వివరణ ఇచ్చారు.

ఖర్గే

కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం 

కర్నాటక ఎన్నికల పోలింగ్‌కు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కర్ణాటకలోని బొమ్మై ప్రభుత్వం కాంట్రాక్టుల్లో 40శాతం కమీషన్ తీసుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ ఓటర్లను బుజ్జగింపులకు పాల్పడుతోందని బీజేపీ సెటైర్లు విసురుతోంది. బీజేపీకి ఊపు తెచ్చేందుకు పీఎం మోదీ రాష్ట్రంలో వరుస ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ప్రధాని ఏప్రిల్ 28 నుంచి మే 7వరకు తన ప్రచారాన్ని కొనసాగించనున్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ పోలింగ్ జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీని విషసర్పంతో పోల్చడంపై ఖర్గే వివరణ