Congress : పిట్రోడా సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కు సంబంధం లేదన్న జైరాం రమేష్
భారతీయులను చైనీస్-ఆఫ్రికన్లతో పోల్చుతూ శామ్ పిట్రోడా చేసిన ప్రకటనపై కాంగ్రెస్ వెనుకంజ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ''భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వంపై పిట్రోడా వ్యాఖ్యలు దురదష్టకరం. పిట్రోడా పోలికలు మాకు ఆమోదయోగ్యం కాదు. పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు'' అని జైరామ్ రమేష్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. పిట్రోడా ఏమన్నారు? భారతదేశంలో ప్రజాస్వామ్యం,భిన్నత్వం గురించి పిట్రోడా తన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. భారతదేశం వైవిధ్యమైన దేశమని,తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా,పశ్చిమవాసులు అరబ్బులుగా కనిపిస్తారని,ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా,దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరగా ఉంటారని చెప్పారు.ఇవన్నీ ఎలా ఉన్నా మేమంతా అన్నదమ్ములం.భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వేర్వేరు ఆచారాలు,ఆహారం,మతం,భాషలను కలిగి ఉంటామని, అయితే భారతదేశంలోని ప్రజలు ఒకరినొకరు గౌరవిస్తారని పిట్రోడా అన్నారు.
పిట్రోడా వ్యాఖ్యలపై హిమంత బిస్వా శర్మ స్పందన
పిట్రోడా ప్రకటనను లక్ష్యంగా చేసుకుని, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ..'శామ్ భాయ్, నేను ఈశాన్య ప్రాంతానికి చెందినవాడిని, నేను భారతీయుడిలా కనిపిస్తున్నాను. మనది విభిన్నమైన దేశం, మనం భిన్నంగా కనిపించవచ్చు, కానీ మనమందరం ఒక్కటే. మన దేశం గురించి కనీసం విజ్ఞానం పెంచుకోండి...అని ఆయన వ్యాఖ్యానించారు. విభజించి పాలించాలనే కాంగ్రెస్ సిద్ధాంతం సిగ్గుచేటని ఆక్షేపించారు.