కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బుధవారం విడుదల చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్, లోపి సిద్ధరామయ్య, శశిథరూర్, ఇటీవల బీజేపీ నుంచి వచ్చిన సీనియర్ నేత జగదీష్ షెట్టర్‌తో సహా మొత్తం 40మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ రూపొందించింది. పార్టీ ప్రచారకర్తల జాబితాలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా, జైరాం రమేష్, బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్, పృథ్వీరాజ్ చవాన్ ఉన్నారు.
రాష్ట్రంలోని కీలక నేతలందరూ నామినేషన్ల దాఖలు
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, కులాల ప్రాతిపదికన ఓట్లు అడగబోమన్నారు. వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య నామినేషన్ దాఖలు చేశారు. కర్ణాటకలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని కీలక నేతలందరూ తమ నామినేషన్లను దాఖలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ పోలింగ్ మే 10న జరగనుండగా, ఓట్లను మే 13న లెక్కించనున్నారు.