రాజస్థాన్‌లో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. ఎన్నికల నోటిఫికేషన్ ముందే అభ్యర్థుల ప్రకటన!
రాజస్థాన్‌లో ఎన్నికల హీట్ మొదలైంది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించాయి. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. కాంగ్రెస్ 70 మంది అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు గెలవలేని స్థానాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ముందే ప్రకటించాలని కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ అదిష్టానం బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఈసారీ ప్రయోగాలను చేయడానికి సిద్ధమైందని, కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించేందుకు రెడీగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత ఒకరు చెప్పారు.
సర్వేల ఆధారంగా అభ్యర్థులకు టికెట్!
సర్వేల ఆధారంగా గెలుపొందే అవకాశం ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఈసారి టికెట్ ఇవ్వనున్నారు. అదే విధంగా సీటు కోసం పోటీ తక్కువ ఉన్న నియోజకవర్గాలకు తొలుత అభ్యర్థులను ప్రకటించనున్నారు. సీటు కోసం పోటీ ఎక్కువ ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొంచెం అలస్యమవుతుందని హస్తం వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌లకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్ మినహా మిగతా చోట్ల బీజేపీయేతర ప్రభుత్వాలున్నాయి. ఈ రాష్ట్రాల్లో గెలుపు సాధించాలని కమలం పెద్దలు ఇప్పటికే ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు టాక్.