LOADING...
Rahul Mamkootathil: రేప్ కేసు తర్వాత.. మరో యువతి ఫిర్యాదుతో చిక్కుల్లో కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే
రేప్ కేసు తర్వాత.. మరో యువతి ఫిర్యాదుతో చిక్కుల్లో కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే

Rahul Mamkootathil: రేప్ కేసు తర్వాత.. మరో యువతి ఫిర్యాదుతో చిక్కుల్లో కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్ తనపై అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత గర్భాన్ని తొలగించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడంటూ కేరళకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు ఇటీవల ఆయనపై రేప్ కేసు నమోదు కాగా, ప్రస్తుతం పరారీలో ఉన్న మామ్‌కుటత్తిల్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో మరో యువతి కూడా అతడిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ముందుకు వచ్చింది. 23 ఏళ్ల వయస్సున్న ఈ యువతి,మామ్‌కుటత్తిల్ తనను లైంగికంగా వేధించాడని కేరళ కాంగ్రెస్ కమిటీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేశాడని ఆమె పేర్కొంది.

వివరాలు 

అతడిపై రేప్ కేసు నమోదు కావడంతో ధైర్యం చేసి..

రాజకీయ రంగంలో అతడికి ఉన్న ప్రభావం కారణంగా ఇప్పటిదాకా పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని, తాజాగా అతడిపై రేప్ కేసు నమోదు కావడంతో ధైర్యం చేసి తాను కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ ఫిర్యాదు అందిన వెంటనే దీనిపై పూర్తిగా విచారణ జరపాలని పోలీసులకు సూచించినట్లు పార్టీ చీఫ్ సన్నీ జోసెఫ్ వెల్లడించారు. యువతి పంపిన మెయిల్‌ను పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా,ఇటీవల కేరళకు చెందిన ఓ నటి సహా మరో యువతి కూడా మామ్‌కుటత్తిల్ తమను లైంగికంగా వేధించాడంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

వివరాలు 

పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మామ్‌కుటత్తిల్

ఆ ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే అతడిపై రేప్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ మామ్‌కుటత్తిల్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయినప్పటికీ, ఆయన ప్రస్తుతం పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Advertisement