గోసంరక్షణ పేరుతో ఉద్రిక్తతలు సృష్టించే వారిని తరిమేయండి: కాంగ్రెస్
గతంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభుత్వ హయాంలో ఆమోదించిన గోహత్య నిరోధక చట్టాన్ని తాము ఉపసంహరించుకుంటామని కొన్ని వారాల క్రితం కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి కె వెంకటేష్ ప్రకటించారు. అయితే త్వరలో బక్రీద్ (జూన్ 29) వేడుక జరగనున్న నేపథ్యంలో గోవధ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ విషయంపై కర్ణాటక కాంగ్రెస్ నేత, మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడారు. గోసంరక్షణ పేరుతో బక్రీద్ సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించే వ్యక్తులపై నిఘా ఉంచాలని పోలీసులను కోరారు. ఈ క్రమంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయకూడదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వాదిస్తోంది. తమది ఈ సేన, తమది ఆ దళం అంటూ చెప్పుకుంటూ శాలువాలు ధరించి వచ్చిన వారిని తరిమేయాలని ఖర్గే చెప్పారు.
పశువులను చట్టపరంగా రవాణా చేస్తున్న వారిని వేధించొద్దు: ఖర్గే
పశువులను చట్టపరంగా రవాణా చేస్తున్న వ్యక్తులను వేధించడం మానుకోవాలని తాను పోలీసు అధికారులను ఆదేశించానని మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. చట్టాన్ని సేనలు, దళాలు వారి చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతిస్తే మీ పని ఏమిటని మంత్రి ప్రియాంక్ ఖర్గే పోలీసులను ప్రశ్నించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వాళ్లును పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టాలని స్థానిక అధికారులను కోరారు. పశువుల రవాణాకు సంబంధించిన పత్రాలు, వెటర్నరీ సర్టిఫికేట్ ఉన్నవారిని అడ్డుకోకూడదని, అయితే కాగితాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసులకు సూచించారు. మత ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేసిన ఖర్గే, విభజన సిద్ధాంతాలను ప్రచారం చేసే స్వయం ప్రకటిత నాయకులపై చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
పశువులను అమ్మడం, కొనడం సహజం: ఖర్గే
పశువులను, ముఖ్యంగా ఆవులను రవాణా చేయడంపై స్పష్టమైన చట్టం ఉందని, దానిని పాటించాలని మంత్రి కోరారు. కర్ణాటకలో ఇది స్థానిక జాతరల సీజన్ అని ఖర్గే పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రజలు పశువులను అమ్మడం, కొనడం చేస్తుంటారని చెప్పారు. సేనలు, దళాల పేరుతో శాలువాలు కప్పుకొని వచ్చే వారికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అర్థం కావడం లేదని స్పష్టం చేశారు. తాను ఒక వ్యక్తి నుంచి ఆవును కొనుగోలు చేసి ఇంటికి రవాణా చేస్తానని, ఇది చట్టబద్ధమైన విషయం అన్నారు. చట్టబద్ధంగా పశువులను రవాణా చేసేవారిపై సేనలు, దళాల పేరుతో దాడులు చేస్తున్నారని, వారిని అడ్డుకోవాలని సూచించారు.