
కాంగ్రెస్ ప్లీనరీ: సీడబ్ల్యూసీకి ఎన్నికలు వద్దంటూ తీర్మానం; ఖర్గేకు బాధ్యత అప్పగింత
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కీలక బాడీ అయిన సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ఎన్నికలు వద్దంటూ తీర్మానించారు.
సీడబ్ల్యూసీ సభ్యులందరినీ నామినేట్ చేసే అధికారాన్ని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఇవ్వాలని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయించిందని కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ శుక్రవారం తెలిపారు.
అయితే ఈ తీర్మానం ఏకగ్రీవంగా జరగలేదని అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, దిగ్విజయ సింగ్ వంటి నేతలు ఎన్నికలకే మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించవచ్చని సింఘ్వీ పేర్కొన్నారు.
కాంగ్రెస్
సోనియా, రాహుల్ అందుకే హాజరు కాలేదట
అయితే తొలిరోజు కాంగ్రెస్ ప్లీనరీకి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాకపోవడంపై నాయకులు స్పందించారు. పార్టీ చీఫ్ ఖర్గేకు స్వేచ్ఛనివ్వాలని, ఆయన తీసుకునే నిర్ణయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదని భావించి వారు కీలక సమావేశానికి దూరంగా ఉన్నారని చెప్పారు.
శనివారం, ఆదివారం జరిగే సమావేశాలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరవుతారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
సీడబ్ల్యూసీలో పార్టీ అధ్యక్షుడితో సహా 25 మంది సభ్యులుంటారు. పాతపద్ధతిలో అయితే 12మందిని పార్టీ చీఫ్ నామినేట్ చేస్తారు. మిగిలిన 12 మందిని ఏఐసీసీ సభ్యులు ఎన్నుకుంటారు. అయితే ఈ సారి ఎన్నికల లేకుండా అందరినీ పార్టీ చీఫ్ నామినేట్ చేయనున్నారు.