Delhi Elections: దిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ గ్యారంటీలను విడుదల చేసిన రేవంత్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ఈ క్రమంలో ఢిల్లీ ప్రజలకు పలు గ్యారెంటీలను ప్రకటించింది.
అందులో 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు సిలిండర్, ఉచిత రేషన్ కిట్‌లు ఉన్నాయి.
ఈ గ్యారంటీల పోస్టర్లను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల వరకు అప్పులను మాఫీ చేసినట్లు చెప్పారు.
అలాగే, 21వేల కోట్ల రూపాయల రుణమాఫీ కూడా చేశామని వివరించారు.
వివరాలు
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడం ద్వారా తమ నిబద్ధతను ప్రదర్శించామని చెప్పారు.
ప్రస్తుతం ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందని ఆయన చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చాక ఈ స్థాయిలో ఎవరూ రుణమాఫీ చేయలేదని, మోదీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు ఇచ్చామన్న మాటలతో ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో 4 వేల కోట్ల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణానికి చెల్లించామని, దేశంలో నిరుద్యోగ సమస్య విషమంగా మారిందని, మోదీ ప్రభుత్వం ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఎక్కడా అమలు కాలేదని, 11 ఏళ్లలో కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
వివరాలు
ఢిల్లీ కాలుష్యంతో నివాసయోగ్యం కాకుండా మారింది
తెలంగాణలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, కాంగ్రెస్ ఢిల్లీకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి తాను బాధ్యుడినని తెలిపారు.
అలాగే, ఢిల్లీ కాలుష్యంతో నివాసయోగ్యం కాకుండా మారిందని, ఢిల్లీ రావాలంటే జ్వరాలు వస్తున్నాయని, ఈ పరిస్థితిని సరిచేసేందుకు కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని అప్పుడే దిల్లీ బాగుపడుతుందని అన్నారు.
తెలంగాణలో లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్‌ను ఓడించామని, ఢిల్లీలో ఆప్‌ను కూడా ఓడిస్తామని చెప్పారు. దావోస్‌కు పెట్టుబడుల కోసం వెళ్తున్నాం. పర్యటన ముగిసిన తర్వాత పెట్టుబడులు ఎంత వచ్చాయో చెబుతాం. అవినీతి నివారణకు కృషి చేస్తామని చెప్పారు.
వివరాలు
ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి..
మోదీ ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయల అప్పులను కార్పొరేట్ కంపెనీలకు మాఫీ చేసి, ప్రజల ప్రయోజనాలు పరిగణించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో 1.5 శాతం ఓట్లు ఉన్న కాంగ్రెస్ 40 శాతం ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చిన విధంగానే ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది' అంటూ కామెంట్స్ చేశారు.