హైదరాబాద్ వేదికగా కీలక సీడబ్ల్యూసీ సమావేశాలు.. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం గురి
తెలంగాణపై ఏఐసీసీ(అఖిల భారత జాతీయ కాంగ్రెస్) ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైదరాబాద్ వేదికగా నిర్వహించనుంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం, రానున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా సన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగింది. టీపీసీసీ ప్రతిపాదన మేరకు కాంగ్రెస్ జాతీయ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏఐసీసీ ఆమోదించింది. పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 39 మంది వర్కింగ్ కమిటీ సభ్యులు రాష్ట్రానికి రానున్నారు.
కేసీఆర్ పై సోనియా ధ్వజమెత్తే అవకాశం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం చివరి రోజు సెప్టెంబరు 17న విలీన దినోత్సవాన్ని జరపనున్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజును పురస్కరించుకుని సోనియా గాంధీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ, హైదరాబాద్ వేదికగా మాట్లాడనుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. సీఎం కేసీఆర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజుకోనుంది. ఈ మేరకు కాంగ్రెస్ ఎన్నికల సమర శంఖారావం పూరించనుంది. 17న, 100 మందికిపైగా పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు సమాచారం. మరోవైపు అక్టోబరు 2 నుంచి టీపీసీసీ బస్సు యాత్ర చేపట్టనుంది. నెల రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.