కిరణ్ పటేల్: పీఎంఓ అధికారినంటూ హల్‌చల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు; 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ప్రధానమంత్రి కార్యాలయం( పీఎంఓ)అధికారిగా నటించి అడ్డంగా దొరికిపోయిన గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్‌ను శుక్రవారం శ్రీనగర్ కోర్టు 15రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. జమ్ముకశ్మీర్ పోలీసులు కిరణ్ పటేల్‌ను అరెస్టు చేసిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి కిరణ్ పటేల్‌ను మార్చి మొదటివారంలోనే అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతని అరెస్టును సీక్రెట్‌గా ఉంచారు. కిరణ్ పటేల్ సినిమా తరహాలో జమ్ముకశ్మీర్ పోలీసులను మోసం చేశాడు. తాను ప్రధానమంత్రి కార్యాలయంలో స్ట్రాటజీ, క్యాంపైనింగ్ అదనపు డైరెక్టర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులకు పరిచయం చేసుకున్నాడు. కాశ్మీర్ లోయలో హోటల్ సౌకర్యాల మెరుగుదలలను తనిఖీ చేయడానికి, దక్షిణ కాశ్మీర్‌లోని ఆపిల్ తోటల కోసం కొనుగోలుదారులను గుర్తించడానికి ప్రభుత్వం తనను పంపిందని అక్కడి అధికారులకు చెప్పాడు.
మూడోసారి అనుమానంతో పోలీసులు అరెస్టు
తప్పుడు పేరు, ఐడెంటిటితో కిరణ్ పటేల్ జమ్ముకశ్మీర్‌ను సందర్శించడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే రెండుసార్లు పీఎంఓ అధికారిగా జమ్ము కశ్మీర్‌లోని చాలా ప్రాంతాలను సందర్శించాడు. మూడోసారి పోలీసులు అరెస్టు చేశారు. పటేల్ వచ్చినప్పుడల్లా జెడ్‌ప్లస్ భద్రత, బుల్లెట్ ప్రూఫ్ ఎస్‌యూవీ వాహనం, శ్రీనగర్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్‌లో వసతిని కల్పించారు. మూడోసారి మార్చి 2న కిరణ్ పటేల్ విమానాశ్రయానికి వచ్చారు. అయితే వీఐపీ కదలికలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో భద్రతా ఏజన్సీలకు అనుమానం వచ్చింది. అనంతరం కిరణ్ పటేల్‌ను అరెస్టు చేశారు. పటేల్‌ను విచారించగా అతని వద్ద నుంచి నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అతనిపై మోసం, ఫోర్జరీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.