ఈనెల 7న మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం
నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) నాయకుడు కాన్రాడ్ సంగ్మా ఈ నెల 7న మేఘాలయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శుక్రవారం సంగ్మా మేఘాలయ గవర్నర్ ఫాగు చౌహాన్‌కు కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విన్నవించారు. దీంతో బీజేపీ మద్దతుతో సగ్మా వరుసగా రెండోసారి మేఘాలయ ముఖ్యమంత్రి కానున్నారు.
32మంది సభ్యుల బలం ఉంది: సంగ్మా
రాష్ట్రంలోని 59 నియోజకవర్గాలకు ఎన్నికల జరగ్గా ఎన్‌పీపీ 26 స్థానాలను కైవసం చేసుకుంది. గత ప్రభుత్వంలో ఎన్‌పీపీకి మిత్రపక్షమైన యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) 11నియోజకవర్గాలతో విజయం సాధించింది. ఎన్నికలకు ముందు బీజేపీతో వచ్చిన మనస్పర్థల కారణంగా సంగ్మా ఒంటరిగానే పోటీ చేశారు. ఫలితాల అనంతరం అసోం సీఎం శర్మ మధ్యవర్తిత్వంతో మళ్లీ బీజేపీ-ఎన్‌పీపీ స్నేహ హస్తాన్ని అందుకున్నాయి. బీజేపీతోపాటు ఇతర పార్టీల మద్దతుతో తమకు 32 మంది సభ్యులు ఉన్నారని సంగ్మా పేర్కొన్నారు.