Anant Ambani: 'నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి'.. తెలుగులో అదరగొట్టిన అనంత్ అంబానీ
ఈ వార్తాకథనం ఏంటి
రాయలసీమలో ఉద్యాన పంటలను ప్రోత్సహించడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో చేపట్టిన 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్'కు శుక్రవారం మదనపల్లెలో శంకుస్థాపన జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల రూపాయల మేర పెట్టుబడులు సమకూర్చనున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా రిలయన్స్ సంస్థ సహకారంతో 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్'ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ హాజరయ్యారు.
వివరాలు
'నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి'
కార్యక్రమంలో మాట్లాడిన అనంత్ అంబానీ తెలుగులో ప్రసంగిస్తూ ఆకట్టుకున్నారు.
'నమస్కారం' అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. 25 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు ఐఎస్‌బీని తీసుకొచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు రైతుల కోసం మరో ఐఎస్‌బీని రాయలసీమకు తీసుకొస్తున్నారని ప్రశంసించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో ఆంధ్ర భూమి 'సువర్ణ భూమి'గా మారుతోందని అన్నారు.
"గౌరవనీయులైన చంద్రబాబు గారు.. ఇవాళ మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. అందమైన మీ రాష్ట్రానికి నేను ఏం చేయగలనో చెప్పండి" అని అనంత్ అంబానీ అన్నారు.
ఆయన తెలుగులో ఈ మాటలు చెప్పడంతో సభలో ఆసక్తికర వాతావరణం నెలకొంది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు వేదికపై ఉన్న ఇతర నేతలు సరదాగా నవ్వారు.
వివరాలు
మదనపల్లెతో ఠాగూర్‌కు ఉన్న అనుబంధం
దేశ యువత వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు సంకల్పంతో పనిచేస్తోందని అనంత్ అంబానీ చెప్పారు.
"ఇవాళ మనం కేవలం ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం లేదు. గ్రామీణ పరిశ్రమలకు, ఆర్థికంగా బలపడే గ్రామాలకు, సుస్థిర భారత నిర్మాణానికి, మన సోదర సోదరీమణుల భవిష్యత్తుకు పునాది వేస్తున్నాం" అని అన్నారు.
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కూడా తన ప్రసంగంలో అనంత్ అంబానీ ప్రశంసించారు.
మదనపల్లెకు చారిత్రక ప్రాధాన్యం ఉందని అనంత్ అంబానీ గుర్తుచేశారు.
1919లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలోనే జాతీయ గీతం 'జనగణమన'ను బెంగాలీ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించిన విషయాన్ని ప్రస్తావించారు.
వివరాలు
రైతుల ఆదాయమే లక్ష్యం
టెక్నాలజీని వినియోగించి రైతుల ఆదాయాన్ని పెంచాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని అనంత్ అంబానీ తెలిపారు.
ఇదే 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ విద్యాసంస్థలో చదివే విద్యార్థులు భవిష్యత్తులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలతో కంప్రెస్‌డ్ బయోగ్యాస్ ప్లాంట్‌ను రిలయన్స్ ఏర్పాటు చేస్తోందని కూడా అనంత్ అంబానీ వెల్లడించారు.
రైతుల ఆదాయాన్ని పెంచాలన్న తన తాత ధీరూభాయ్ అంబానీ కలలను సాకారం చేయడంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కీలకంగా నిలుస్తుందని అన్నారు.
వివరాలు
అనంత్‌పై చంద్రబాబు ప్రశంసలు
అనంత్ అంబానీ ప్రసంగానికి స్పందించిన సీఎం చంద్రబాబు ఆయనపై ప్రశంసలు కురిపించారు.
అనంత్ కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదని, పర్యావరణ పరిరక్షణకు కూడా కృషి చేస్తున్నారని అన్నారు.
2035 నాటికి రిలయన్స్‌ను నెట్‌జీరో కార్బన్ సంస్థగా మార్చే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారిపై భక్తితో ఉచితంగా ఎలక్ట్రిక్ బస్సులను అందించారని చంద్రబాబు గుర్తుచేశారు.
జంతువుల సంరక్షణకు కూడా సేవ చేస్తున్న అనంత్ అంబానీని 'మన తెలుగు ముద్దుబిడ్డ'గా సీఎం అభివర్ణించారు.