Train accident: రైలు ప్రమాదానికి కుట్ర.. రివార్డు కోసం రైల్వే సిబ్బంది కన్నింగ్ ప్లాన్
దేశవ్యాప్తంగా రైల్వే పట్టాలపై ప్రమాదకర వస్తువులను అడ్డుగా పెడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఇటీవల గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో కిమ్-కోసాంబ మార్గంలో రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు సిలిండర్‌ను ఉంచి, సేఫ్టీ పిన్ ఇలాస్టిక్ రైల్ క్లిప్‌ను తొలగించిన ఘటన చోటు చేసుకుంది. ఇది రైలును ప్రమాదానికి గురి చేయాలనే కుట్రగా భావిస్తున్నారు. పోలీసుల విచారణలో తాజాగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు ట్రాక్‌మెన్లు ప్రమాదాన్ని తప్పించామని చెప్పి రివార్డు పొందాలనే ఉద్దేశంతో ఈ కట్టు కథ అల్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
ఈ ఘటనలో సంబంధం ఉన్న ట్రాక్‌మెన్ సుభాష్ పోడార్, మనీష్ మిస్త్రీ, కాంట్రాక్ట్ వర్కర్ శుభమ్ జైస్వాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లలో ఉన్న సమాచారం ఆధారంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో వారు పట్టాలపై ఉంచిన ఇనుప ప్లేట్లను 25 నిమిషాల కిందటే అమర్చారని అంగీకరించారు. అయితే వారు ఈ సమయంలో ఎలా గుర్తించగలిగారు అనేది పోలీసులు అనుమానించారు. దీంతో ఈ ముగ్గురు చెప్పిన కథలు అవాస్తమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.