Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఆర్మీ రైలును పేల్చివేసేందుకు కుట్ర.. రైల్వే ఉద్యోగి అరెస్టు
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఆర్మీ రైలును టార్గెట్ చేస్తూ పేల్చివేసేందుకు కుట్ర పన్నిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై 10 డిటోనేటర్లను అమర్చిన సబీర్ అనే రైల్వే ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపడుతున్నాయి. సబీర్ అనే వ్యక్తి, సెప్టెంబర్ 18న మధ్యప్రదేశ్‌లోని నేపానగర్ వద్ద రైల్వే ట్రాక్‌పై 10 డిటోనేటర్లు అమర్చాడు. దీనిపై సమాచారం అందుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఆర్పీఎఫ్ వంటి సంస్థలు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించాయి.
దర్యాప్తును వేగవంతం చేసిన విచారణ సంస్థలు
ఇదే తరహా మరో కుట్ర ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగులోకి వచ్చింది. రైల్వే ట్రాక్‌పై ఎల్‌పీజీ సిలిండర్‌ను ఉంచి ప్రమాదం చేయాలని పన్నిన కుట్రను రైల్వే సిబ్బంది సమయానికి గుర్తించి ఆపివేశారు. అక్కడ గ్యాస్ సిలిండర్‌తో పాటు పెట్రోల్, గన్ పౌడర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలు రైల్వే ట్రాక్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలను రేకెత్తించాయి. ఇద్దరు నిందితుల ఉద్దేశ్యం ఏంటో ఇంకా తెలియనప్పటికీ, సంబంధిత విచారణ సంస్థలు అనుమానితుల నుండి సమగ్రంగా సమాచారాన్ని సేకరిస్తున్నాయి.