Andhra Pradesh: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మూడేళ్లలో పూర్తి.. పనులకు రూ.45 వేల కోట్లతో టెండర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేస్తామని, రూ.45 వేల కోట్లతో పనులు ప్రారంభించేందుకు టెండర్లను పిలిచేందుకు అథారిటీ అనుమతి ఇచ్చిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ అంశంపై గురువారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే ప్రక్రియ జరుగుతుందన్నారు. ఆయన బుధవారం రాజమహేంద్రవరం, కాకినాడలో విలేకర్లతో మాట్లాడారు. జనవరి నెలాఖరుకల్లా అన్ని టెండర్లను పూర్తి చేసి రాజధాని నిర్మాణ పనులను వేగంగా ప్రారంభిస్తామన్నారు. ఐదు ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, 3600 నివాసాలు అధికారులకు, సుమారు 3000 కిలోమీటర్ల ట్రంక్‌రోడ్లు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.
ప్రాజెక్టు ఏడాదిన్నరలో పూర్తవుతుంది: నారాయణ
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు జూన్, జులై నెలల్లో ప్రయత్నం చేస్తామన్నారు. శాసనసభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని గ్రామాల విలీనంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ, ఆను సరిచేసేందుకు ఆరు నెలలు పట్టాయని, ఇకపై పనులు చక్కగా కొనసాగేందుకు మరిన్ని రెండు నెలలు కావాలనే విషయాన్ని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం తన హయాంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు నుంచి రూ.5,350 కోట్లతో ప్రాజెక్టు తీసుకొచ్చినా, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం వాటాగా 30 శాతం నిధులను చెల్లించకపోవడంతో అది రద్దయ్యిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో నాలుగేళ్ల గడువు పొడిగించారని,అయితే ఈ ప్రాజెక్టు ఏడాదిన్నరలో పూర్తవుతుందని తెలిపారు.
చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తికి రెండు ప్లాంట్ల ఏర్పాటు
అంతేకాకుండా, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన రూ.3200 కోట్లను గత ప్రభుత్వం, పురపాలికలకు ఇవ్వకుండా దారి మళ్లించే చర్యలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి కోసం రాజమహేంద్రవరం-కాకినాడ, నెల్లూరు-గూడూరు మధ్య రెండు ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ప్రస్తుతం విచారణ జరగుతున్నదని ఆయన చెప్పారు.