Loading...
Andhra Mandapam: ఏడాదిలోగా 'ఆంధ్ర మండపం' నిర్మాణం పూర్తి చేయాలి.. చంద్రబాబు
ఏడాదిలోగా 'ఆంధ్ర మండపం' నిర్మాణం పూర్తి చేయాలి.. చంద్రబాబు

Andhra Mandapam: ఏడాదిలోగా 'ఆంధ్ర మండపం' నిర్మాణం పూర్తి చేయాలి.. చంద్రబాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఆంధ్ర మండపం' కన్వెన్షన్‌ హాల్‌ నిర్మాణ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గడువు విధించారు. వచ్చే ఏడాది కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) భాగస్వామ్య సదస్సును ఈ కొత్త కన్వెన్షన్‌ సెంటర్‌లోనే నిర్వహించాలని సూచించారు. విశాఖ నగర పరిధిలోని కాపులుప్పాడ కొండపైభాగంలో ఆంధ్ర మండపం నిర్మాణం కోసం 24 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధికారులు ఏడు ఆప్షన్లతో త్రీడీ నమూనాలను రూపొందించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ) విధానంలో నిర్మాణ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది.

వివరాలు

సముద్ర మట్టానికి 120 మీటర్ల ఎత్తులో నిర్మాణం

కాపులుప్పాడ కొండపై సముద్ర మట్టానికి 120 మీటర్ల ఎత్తులో ఆంధ్ర మండపాన్ని నిర్మించనున్నారు.

కేవలం కన్వెన్షన్‌ సెంటర్‌గా కాకుండా.. సదస్సులు, ప్రదర్శనలు, విలాసవంతమైన బస వంటి అన్ని సదుపాయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు.

5 వేల మంది కూర్చునే సామర్థ్యంతో అత్యాధునిక ఆడియో-విజువల్‌ టెక్నాలజీ, ఇంటీరియర్స్‌తో ప్రధాన ఆడిటోరియాన్ని నిర్మించనున్నారు.

ఇందుకోసం 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కేటాయించారు. అలాగే 1.50 లక్షల చదరపు అడుగుల్లో ఎగ్జిబిషన్‌ హాల్‌ ఏర్పాటు చేయనున్నారు.

వివరాలు

250కి పైగా గదులతో ఫోర్‌స్టార్‌ హోటల్

విదేశీ ప్రతినిధులు, ప్రముఖులు బస చేసేందుకు 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫోర్‌స్టార్‌ హోటల్‌ను నిర్మించనున్నారు.

ఇందులో 250కి పైగా గదులు ఉండనున్నాయి. ఇక ప్రాంగణం వెలుపల ఉన్న 6.8 ఎకరాల స్థలంలో అందమైన పూలతోటలు, వాటర్‌ ఫౌంటెన్లు ఏర్పాటు చేయనున్నారు.

తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కళాఖండాలతో పాటు, అతిథులు సముద్ర అందాలను వీక్షించేలా వ్యూపాయింట్లను కూడా అభివృద్ధి చేయనున్నారు.

ADVERTISEMENT