Manmohan Singh Memorial: మన్మోహన్ సింగ్ స్మారకానికి స్థల కేటాయింపుపై వివాదం
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలానికి సంబంధించి వివాదం రాజుకుంటోంది. ఈ అంశంపై బీజేపీపై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందిస్తూ, "ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, అన్ని విభేదాలు కూడా అతనితోనే ముగిసిపోవాలన్నారు. కానీ ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయని, అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియల్లో ఇలాగే జరిగి ఉంటే ఎలా అనిపించేదని చెప్పారు. మన్మోహన్ సింగ్ స్మారక స్థలానికి స్థలం ఇప్పటికీ కేటాయించకపోవడం సరికాదన్నారు.
బీజేపీపై తీవ్ర విమర్శలు
ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదని, ఇది దేశ చరిత్రకు చెందిన అంశమని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఈ విషయంపై బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయం గురించి మాట్లాడడం కూడా సిగ్గుచేటు అని, రాజ్‌ఘాట్ కాంప్లెక్స్‌లో డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కోసం స్థలం ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్నారు. ఇదే ప్రశ్నను ప్రధాని నరేంద్ర మోడీకి అడగాలనుకుంటున్నానని చెప్పారు. గతంలో నిగంబోధ్ ఘాట్‌లో మిగతా మాజీ ప్రధానుల అంత్యక్రియలు జరిగాయి.
దేశ ప్రజల అభిప్రాయం
మన్మోహన్ సింగ్ స్మారక స్థలాన్ని కూడా అదే ప్రదేశంలో ఏర్పాటు చేయాలన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ డిమాండ్ మాత్రమే కాదని, దేశ ప్రజల అభిప్రాయమని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతివాదన ఇచ్చింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ కాంగ్రెస్ ఎప్పుడూ గాంధీ కుటుంబానికి వెలుపల ఉన్న నేతలను గౌరవించదన్నారు. అయితే మోడీ ప్రభుత్వం మాత్రం అన్ని పార్టీల నేతలను గౌరవిస్తుందని, కాబట్టి కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదని విమర్శించారు. ఈ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ఫోన్ చేశారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశం
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం తగిన స్థలాన్ని కేటాయించాల్సిందిగా వారు కోరారు. ఈ పిలుపునకు హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, "అంత్యక్రియల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదని, ప్రభుత్వం ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం తరువాత కూడా రాజకీయం కొనసాగుతుండటం విశేషం