LOADING...
Visakhapatnam: విశాఖ ఉక్కులో వీఆర్‌ఎస్‌ అమలుపై వివాదం 
విశాఖ ఉక్కులో వీఆర్‌ఎస్‌ అమలుపై వివాదం

Visakhapatnam: విశాఖ ఉక్కులో వీఆర్‌ఎస్‌ అమలుపై వివాదం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2025
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం ఉక్కు పరిశ్రమలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) అమలు విషయంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (డీపీఈ) మార్గదర్శకాలను విస్మరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఆర్‌ఎస్‌ ప్రకటించిన తర్వాత, అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కోసం రూ.11,400 కోట్ల భారీ ఆర్థిక సహాయ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం కేంద్ర ఉక్కు మంత్రి స్వయంగా ప్లాంటును సందర్శించి,ఈ నిధుల సహాయంతో ఉత్పత్తిని పెంచి లాభాల్లోకి తీసుకువస్తామన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో,పలువురు ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ నిర్ణయాన్నివిరమించుకున్నారు. అయితే, ఈ ఉపసంహరణకు ఫిబ్రవరి 3వరకు మాత్రమే గడువు ఉందని చెప్పి, పలువురి అభ్యర్థనలను తిరస్కరించారని ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి, డీపీఈ నిబంధనల ప్రకారం,కమిటీ తుది నిర్ణయం తీసుకునే వరకు ఉపసంహరణకు అవకాశం ఉండాలి.

వివరాలు 

వార్షిక పనితీరు గ్రేడింగ్‌లలో అవకతవకలు 

అయినప్పటికీ, కొన్ని దరఖాస్తులను తిరస్కరించగా, కొందరిని మాత్రం మినహాయించినట్లు సమాచారం. వీఆర్‌ఎస్‌కు 1600 మంది దరఖాస్తు చేయగా, అందులో 1100 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీఆర్‌ఎస్‌ ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలలో, గత మూడేళ్ల వార్షిక పనితీరు ఆధారంగా అర్హతను నిర్ణయించాల్సి ఉంది. ప్రత్యేకంగా, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు 'వో' గ్రేడ్ పొందితే, నాన్‌ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు 'వెరీ గుడ్‌' గ్రేడ్ పొందితే వారు అర్హత పొందరు. కానీ, దీనికి 2024, 2023, 2022 సంవత్సరాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, 2023, 2022, 2021 సంవత్సరాల గ్రేడింగ్‌లను పరిశీలించారు.

వివరాలు 

అర్హత కోల్పోయిన ఉద్యోగులకు.. లభించని జవహర్‌లాల్‌ నెహ్రూ అవార్డులు  

దీని కారణంగా, 2024 సంవత్సరానికి సంబంధించి వార్షిక పనితీరు నివేదికను పూర్తిగా సమీక్షించకుండానే నిర్ణయాలు తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా, ఫిబ్రవరి 18న జవహర్‌లాల్‌ నెహ్రూ అవార్డులను అందించాల్సి ఉండగా, అర్హత కోల్పోయిన ఉద్యోగులకు అవి లభించలేదని తెలుస్తోంది. అంతేగాక, వీఆర్‌ఎస్‌కి అర్హత లేనివారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారని, మంత్రిత్వశాఖకు ఈ విషయంపై ఫిర్యాదులు అందడంతో కొన్ని దరఖాస్తులను రద్దు చేసినట్లు సమాచారం.

వివరాలు 

ఉద్యోగులపై ఒత్తిళ్లు, అన్యాయ నిర్ణయాలు 

వీఆర్‌ఎస్‌ ప్రక్రియలో పారదర్శకత లేకుండా కొందరిపై ఒత్తిడి తెచ్చి,దరఖాస్తులను వెనక్కి తీసుకునేలా చేస్తుండారని ఆరోపణలు వచ్చాయి. వయసు,ఆరోగ్య కారణాల వల్ల విధులు నిర్వహించలేని వారికి వీఆర్‌ఎస్‌ ఎంతో ప్రయోజనకారి కావచ్చు. అయితే,అటువంటి ఉద్యోగుల దరఖాస్తులను కూడా తిరస్కరించినట్లు సమాచారం.తాజాగా, ఓ ఉద్యోగి అధికారుల ఒత్తిడితో వీఆర్‌ఎస్‌ దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల తర్వాత అతనికి గుండెపోటు రావడంతో స్టంట్స్‌ వేయాల్సి వచ్చింది.దాంతో, తన దరఖాస్తును మళ్లీ పరిగణనలోకి తీసుకోవాలని అతను విజ్ఞప్తి చేసినా, వీఆర్‌ఎస్‌ ప్రక్రియ పూర్తి కాకముందే అతని అభ్యర్థనను తిరస్కరించారని తెలుస్తోంది. ఇక కోకోవన్‌ విభాగంలో 20 మంది హెచ్‌వోడీలు వీఆర్‌ఎస్‌ అర్హత కలిగి ఉన్నప్పటికీ, వారి దరఖాస్తులను తిరస్కరించినట్లు సమాచారం. ఈ కారణంగా, ఉద్యోగులందరిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.