దేశంలో కొత్తగా 10,158 మందికి కరోనా; కేసుల పెరుగుదలపై నిపుణులు ఏంటున్నారంటే!
దేశంలో గత 24 గంటల్లో 10,158 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 230 రోజుల్లో ఇదే అత్యధికమని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.42శాతానికి చేరుకున్నట్లు పేర్కొంది. కోవిడ్ కొత్త కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య నిపుణులు తమ అంచనాలను వెల్లడించారు. రాబోయే 10-12 రోజుల వరకు కేసులు పెరుగుతూనే ఉండవచ్చని పేర్కొన్నారు. ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని అంటున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ, ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
కొత్త బాధితుల్లో అత్యధికం ఒమిక్రాన్ ఉప వేరియంట్ XBB.1.16 బాధితులే
ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల్లో అత్యధిక మంది ఒమిక్రాన్ ఉప వేరియంట్ XBB.1.16 బాధితులేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్‌తో పాటు దాని వేరియంట్లు వ్యాప్తి ఎక్కువగా ఉందని వారు అంచనా వేస్తున్నారు. XBB.1.16 ప్రాబల్యం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 21.6శాతం ఉండగా, అది మార్చిలో 35.8శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. ఈ వేరియంట్ వల్ల ఆసుపత్రిలో చేరికలు, మరణాల సంఖ్య పెరిగినట్లు ఎక్కడా నమోదు కాదని వెల్లడించాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 10లక్షలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో 3 లక్షలకు పైగా పడకలు ఆక్సిజన్‌తో కూడినవి కాగా, 90,785 ఐసీయూ పడకలు, 54,040 ఐసీయూ కమ్ వెంటిలేటర్ బెడ్‌లు అని వెల్లడించారు.