
Corona Virus: దేశంలో మరోసారి కరోనా కలకలం.. కొత్త వేరియంట్లను గుర్తించిన ఇన్సాకాగ్!
ఈ వార్తాకథనం ఏంటి
కోవిడ్ మహమ్మారి మరోసారి కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కొత్తగా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం(INSACOG) వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్‌లో కొవిడ్ కొత్త వేరియంట్లు NB.1.8.1, LF.7 కేసులు నమోదయ్యాయి.
NB.1.8.1 కేసు ఏప్రిల్‌లో వెలుగుచేయగా, LF.7 వేరియంట్‌కు చెందిన నాలుగు కేసులు మే నెలలో నమోదయ్యాయని INSACOG తెలిపింది.
ఈ వేరియంట్లు తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో గుర్తించబడ్డాయి. ఇక దేశవ్యాప్తంగా దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తాజాగా కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి.
మూడేళ్ల విరామం తర్వాత దిల్లీలో 23 కేసులు నమోదయ్యాయని జాతీయ మీడియా పేర్కొంది.
Details
వైరస్ తీవ్రత తక్కువే
ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు హైఅలెర్ట్ లోకి వెళ్లాయి. ఆసుపత్రుల్లో సన్నద్ధత చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే కేసులు ఉన్నప్పటికీ వైరస్ తీవ్రత తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
కానీ ఏదైనా అనూహ్య పరిణామాలకు సిద్ధంగా ఉండేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. అంతర్జాతీయంగా చూస్తే, హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్, చైనా వంటి ఆసియా దేశాల్లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది.
వారానికి వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వీటి వెనుక జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలు LF.7, NB.1.8.1 ఉన్నాయని సింగపూర్ ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఈ వేరియంట్ల లక్షణాలు సాధారణమైనవే: జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం.
Details
నాలుగు రోజుల్లో కోలుకుంటారు
బాధితులు సాధారణంగా నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
దిల్లీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి బీజేపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్ల లభ్యతను సమీక్షించమని సూచించింది.
శ్వాసకోశ వ్యాధుల వివిధ రూపాలపై నివేదికలు సేకరించాలని ఆదేశించింది. కొత్త వేరియంట్ల వ్యాప్తికి మూలకారణాలు వైరస్ మ్యూటేషన్లు, ప్రజలలో ఇమ్యూనిటీ తగ్గుదల అని అధికారులు పేర్కొన్నారు.
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల స్పష్టం చేసినట్టు జేఎన్.1 వేరియంట్ 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్' మాత్రమే, ఇది ఆందోళన కలిగించే వేరియంట్ (Variant of Concern) కాదని పేర్కొంది.
అయినా పరిస్థితిని తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.