
Cough Syrup: దగ్గు మందు వివాదం.. పిల్‌పై విచారణకు సుప్రీం అంగీకారం
ఈ వార్తాకథనం ఏంటి
దగ్గు మందు తాగిన చిన్నారులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 'కోల్డ్‌రిఫ్' (Coldrif Cough Syrup)దగ్గు మందు కారణంగా మధ్యప్రదేశ్‌లో అనేక చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పూర్తి విచారణ కోసం సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(Public Interest Litigation - PIL)దాఖలు చేశారు. తాజాగా న్యాయస్థానం ఆ పిట్‌షన్‌పై విచారణ జరపడానికి అంగీకరించింది. పిటిషనర్ అయిన న్యాయవాది విశాల్ తివేరి ఈ కేసును తక్షణమే విచారించాలని ప్రత్యేకంగా అభ్యర్థించారు. దీనిని పరిగణనలోకి తీసుకుని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్జయ్ భూయాన్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం న్యాయవాదుల అభ్యర్థనను సమీక్షించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది.
వివరాలు
కోల్డ్‌రిఫ్ యజమాని అరెస్టు
ఈ దగ్గు మందు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోల్డ్‌రిఫ్ సిరప్ తయారీ సంస్థ శ్రేసన్ ఫార్మా యూనిట్ యజమాని అరెస్టు అయ్యారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బుధవారం అర్ధరాత్రి చెన్నైలో ఆ సంస్థ యజమాని రంగనాథన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తరవాత కాంచీపురంలోని అతని ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి సమగ్ర విచారణ నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని అరెస్టులు జరుగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్‌లు మధ్యప్రదేశ్ మాత్రమే కాక ఒడిశా, పుదుచ్చేరిలకు కూడా సరఫరా చేసినట్లు తేలింది.