LOADING...
Cough syrup deaths: ఈ రాష్ట్రాల్లో కోల్డ్‌రిఫ్‌ సిరప్‌ నిషేధం.. సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిల్
సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిల్

Cough syrup deaths: ఈ రాష్ట్రాల్లో కోల్డ్‌రిఫ్‌ సిరప్‌ నిషేధం.. సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిల్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2025
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా దగ్గు సిరప్ వాడకం కారణంగా పిల్లలు మృతి చెందుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా మాధ్యప్రదేశ్'లో జరిగిన పిల్లల మరణాల నేపథ్యంలో, ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్‌ (PIL) దాఖలైంది. అక్టోబర్‌ 7, 2025న ఒక న్యాయవాది ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కలుషితమైన దగ్గు సిరప్స్‌ తయారీ, పరీక్ష, నియంత్రణ, పంపిణీ వ్యవస్థలపై రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ ఈ పిటిషన్‌లో కోరారు. ఇటీవ‌ల‌ దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో పిల్లలు దగ్గు సిరప్‌ సేవించాక మృతిచెందిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ సిరప్‌లో డైఎథిలీన్‌ గ్లైకాల్‌ (DEG) అనే రసాయనం కలిసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వివరాలు 

కోల్డ్రిఫ్ దగ్గు సిరప్‌ను ఏ రాష్ట్రాలు నిషేధించాయి? 

ఇది పరిశ్రమల్లో వాడే ద్రావకం కాగా, తక్కువ మోతాదులోనూ మానవ శరీరానికి ప్రాణాంతకమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనల అనంతరం, పంజాబ్‌, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్'లో కోల్డ్‌రిఫ్‌ కఫ్‌ సిరప్‌ను నిషేధించారు. ఇక తెలంగాణలో కూడా ఈ సిరప్‌పై ప్రజలకు హెచ్చరిక జారీ చేసినట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. కోల్డ్‌రిఫ్‌ కఫ్‌ సిరప్‌ తయారీదారు తమిళనాడుకు చెందిన శ్రేసన్‌ ఫార్మా అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సిరప్‌ నమూనాలను పరీక్షించగా అందులో అనుమతించిన మోతాదుకు మించి డైఎథిలీన్‌ గ్లైకాల్‌ ఉన్నట్లు తేలింది. చెన్నైలోని డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ నిర్వహించిన పరీక్షల్లో 48.6 శాతం DEG ఉందని గుర్తించారు.

వివరాలు 

భారత్ తయారుచేసిన కఫ్‌ సిరప్‌ వల్ల ఆఫ్రికా దేశం గాంబియాలో 70 మంది పిల్లలు మృతి

దీంతో ఆ మందును "నాట్‌ ఆఫ్‌ స్టాండర్డ్‌ క్వాలిటీ"గా తమిళనాడు రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ ప్రకటించింది. 2022లో భారతీయ కంపెనీ తయారు చేసిన మరో కఫ్‌ సిరప్‌ వల్ల ఆఫ్రికా దేశం గాంబియాలో 70 మంది పిల్లలు మృతిచెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక వెల్లడించింది. తరువాత ఏడాది ఉజ్బెకిస్తాన్‌లో కూడా భారతదేశం నుంచే ఎగుమతి చేసిన కఫ్‌ సిరప్స్‌ కారణంగా కనీసం 18 మంది పిల్లలు మృతిచెందినట్లు WHO మరోసారి హెచ్చరించింది. ఇక మాధ్యప్రదేశ్'లో తాజాగా చోటుచేసుకున్న ఘటనలతో మళ్లీ కఫ్‌ సిరప్‌ సేఫ్టీపై ప్రశ్నలు తలెత్తాయి. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం కఠినమైన నిబంధనలు అమలు చేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి.