Amit Shah: సైబర్ భద్రత లేకుండా దేశ ప్రగతి అసాధ్యం: అమిత్ షా
సైబర్ సెక్యూరిటీ ప్రాముఖ్యత గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధిలో సైబర్ సెక్యూరిటీ కీలక పాత్ర పోషిస్తుందని, ఈ సాంకేతికత మానవత్వానికి ఓ వరం లాంటిదని అన్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14C) తొలి ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సైబర్ నేరాలకు హద్దులు లేవని,వాటిని ఎదుర్కొనేందుకు అన్ని వర్గాలు ముందుకు రావాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
రాబోయే ఐదేళ్లలో 5,000 సైబర్ కమాండోలు
"సైబర్ సెక్యూరిటీ జాతీయ భద్రతలో కీలక భాగం. ప్రస్తుతం ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మారింది. సైబర్ సెక్యూరిటీ లేకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదు. అందరూ కలసి కృషి చేయాలి. ఈ సాంకేతికత మానవత్వానికి చాలా దోహదపడుతుంది, అలాగే ఆర్థిక పురోగతికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది" అని ఆయన తెలిపారు. సైబర్ నేరాల పెరుగుదలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సైబర్ కమాండోలను శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని షా తెలిపారు.రాబోయే ఐదేళ్లలో 5,000 సైబర్ కమాండోలను సైబర్ నేరాల నివారణ కోసం సిద్ధం చేయాలని కేంద్రం యోచిస్తోందన్నారు "భారతదేశంలో సైబర్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడం ఎంతో అవసరం,ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే లావాదేవీల్లో 46శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి" అని ఆయన పేర్కొన్నారు.
సైబర్ నేరాలపై పోరాడేందుకు నాలుగు ఫ్లాట్‌ఫారమ్‌లు
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14C) నేతృత్వంలో దేశంలో సైబర్ నేరాలపై పోరాడేందుకు నాలుగు ఫ్లాట్‌ఫారమ్‌లను అమిత్ షా ప్రారంభించారు. 2018లో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో స్థాపించిన ఈ సెంటర్, దేశంలోని సైబర్ నేరాల సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో సమన్వయాన్ని బలపరచడమే లక్ష్యంగా పనిచేస్తోంది.