
Covid-19: దేశంలో కరోనా కలకలం.. భారీగా పెరిగిన కరోనా కేసులు..
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి తన పంజా విప్పుతోంది. మొదట్లో అంచలంచలుగా పెరిగిన కేసులు ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నాయి. పదులు,వందలుగా ఉన్న పాజిటివ్ కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరుతున్న తీరు చూస్తుంటే, మళ్లీ గతం మాదిరిగానే ఆందోళనకర పరిస్థితులు వచ్చిపడతాయేమోనన్న భయం వ్యక్తమవుతోంది. గత కొన్ని రోజులుగా భారత్‌లో కోవిడ్-19 కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 306 కరోనా కేసులు నమోదయ్యాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల మొత్తం సంఖ్య 7,121కు పెరిగింది. ఇదే సమయంలో కరోనా కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అధికారికంగా వెల్లడైన వివరాల ప్రకారం,మహారాష్ట్రలో ఒకరు,కేరళలో ముగ్గురు,కర్ణాటకలో ఇద్దరు మృతిచెందారు.
వివరాలు
రాష్ట్రాలవారీగా కరోనా పరిస్థితి
జనవరి నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 74మరణాలు నమోదయ్యాయి. కేరళలో తాజాగా 170కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.దీని ఫలితంగా రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,223కి చేరుకుంది. గుజరాత్‌లో 114 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అక్కడ యాక్టివ్ కేసులు 1,223కు చేరాయి. కర్ణాటకలో మరో 100కేసులు నమోదయ్యాయి.దీంతో అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 459కి పెరిగింది. ఢిల్లీ విషయానికొస్తే,గడిచిన 24గంటల్లో అక్కడ 66కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం యాక్టివ్ కేసులు ఇప్పుడు 757గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 72యాక్టివ్ కేసులు ఉన్నప్పటికీ, కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తెలంగాణలో ఒకే ఒక్క కొత్త కేసు నమోదు కాగా,యాక్టివ్ కేసుల సంఖ్య 11గా ఉంది.
వివరాలు
కరోనా మృతుల వివరాలు
కేరళలో 87 సంవత్సరాల వయసు గల మహిళతో పాటు 69, 78 సంవత్సరాల వయసుల ఇద్దరు పురుషులు కోవిడ్-19తో మృతి చెందారు. వీరంతా ఇప్పటికే ఇతర జబ్బులతో పోరాడుతున్నారు. కర్ణాటకలో 51 ఏళ్ల మహిళ (తీవ్రమైన హై బీపీ, టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతూ) 79 ఏళ్ల వ్యక్తి (హై బీపీ ఉన్నవారు) కోవిడ్ సంక్రమణ కారణంగా మరణించారు. మహారాష్ట్రలో 43ఏళ్ల వ్యక్తి శ్వాస సమస్యలు, కడుపు నొప్పి,శరీర బాధలు,టాచీకార్డియా (హృదయ స్పందన వేగం ఎక్కువవడం),సైనోసిస్ (శరీరంలో ఆక్సిజన్ లెవెల్ తగ్గడం) వంటి లక్షణాలతో బాధపడుతూ మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. జార్ఖండ్‌లో జూన్ 10న మొదటి కోవిడ్ మృతి నమోదైంది.రాష్ట్ర రాజధాని రాంచీలో 44 ఏళ్ల వ్యక్తి కోవిడ్ బారినపడి మరణించినట్లు అధికారిక సమాచారం.
వివరాలు
తయారీపై కేంద్రం చర్యలు
ఆయన రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కేసుల పెరుగుదల దృష్ట్యా కేంద్రం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్లులు ప్రారంభించింది. ఆసుపత్రులలో తగినంత ఆక్సిజన్, ఐసోలేషన్ బెడ్లు, వెంటిలేటర్లు, అవసరమైన ఔషధాల లభ్యతను సమీక్షించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ అన్ని అవసరమైన వసతులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. అధికారుల ప్రకారం, ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులు ఎక్కువగా తేలికపాటి లక్షణాలతో ఉంటున్నాయని, వీటిని ఇంట్లోనే చికిత్సతో నిర్వహించగలమని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.