కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం, బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాం: సీపీఐ
తెలంగాణలో అసెంబ్లీ సమరానికి సమయం దగ్గర పడింది. కేవలం మరో మూడు నెలల్లోనే శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు పొత్తుల కోసం సీపీఐ ప్రయత్నిస్తోంది. తమను పొత్తుల పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీతో పొత్తుల అంశంపై సీపీఐ నేతలు చర్చిస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో సీపీఐ చర్చలు సాగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హైదరాబాద్ పార్టీ ఆఫీసులో స్పందించారు. కాంగ్రెస్ మధ్యవర్తులతో ప్రాథమికంగానే చర్చించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే తాము కొన్ని ప్రతిపాదనలు పెట్టామన్నారు. వామపక్షాలు త్యాగం చేస్తారని అనుకోవద్దని సూచించారు.
సీపీఐ- సీపీఎం కలిసే ఎన్నికలకు వెళ్తాం : కూనంనేని
కాంగ్రెస్ పార్టీతో పొత్తులపై చర్చ సందర్భంగా,వామపక్ష పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. 3-4 స్థానాల్లో తమకు బలం ఉన్న చోట పోటీ చేస్తామని కూనంనేని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ అభిప్రాయం చెప్పాక చర్చల్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.ఈ మేరకు మరో దఫా సీపీఐ, సీపీఎం నాయకత్వం కలిసి కాంగ్రెస్ తో భేటీ అవుతామన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు తాము ఎవరితోనైనా పొత్తు కలుస్తామని స్పష్టం చేశారు. సీపీఐ- సీపీఎం కలిసే ఎన్నికలకు వెళ్తామన్నారు. కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీలతోనూ ఈ మేరకు చర్చిస్తున్నట్లు తెలిపారు. మహాకూటమి ఏర్పాటు అవుతుందా అన్న సందేహాలూ రేగుతున్నాయి. కాంగ్రెస్‌లో వైఎస్సాఆర్‌టీపీ విలీనం ఉందా లేదా అన్న అంశంపై క్లారిటీ రాకపోవడం గమవార్హం.