Page Loader
Air India Plane Crash: ఆర్థిక సమాచారం లేకపోతే పరిహారం కాదా? బాధిత కుటుంబాల ఆవేదన..!
ఆర్థిక సమాచారం లేకపోతే పరిహారం కాదా? బాధిత కుటుంబాల ఆవేదన..!

Air India Plane Crash: ఆర్థిక సమాచారం లేకపోతే పరిహారం కాదా? బాధిత కుటుంబాల ఆవేదన..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

గత నెలలో దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనంతరం, మృతుల కుటుంబాలకు తాత్కాలిక పరిహారం అందించేందుకు ఎయిరిండియా ముందుకొస్తోంది. అయితే, ఈ పరిహారం పొందేందుకు ఆర్థిక వివరాలు చెప్పాలని బలవంతం చేస్తోందని బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ ఆరోపణలపై ఎయిరిండియా స్పందించాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది? విమాన ప్రమాద బాధితుల తరఫున పని చేస్తున్న బ్రిటన్‌కు చెందిన ప్రముఖ న్యాయ సంస్థ 'స్టీవర్ట్స్‌' వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎయిరిండియా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న 40 కుటుంబాలకు ఓ ప్రశ్నావళిని పంపిందని పేర్కొంది. ఆ ప్రశ్నలలో వ్యక్తిగత సమాచారం మాత్రమే కాకుండా, ఆర్థిక స్థితిగతులపై కూడ ప్రశ్నలు ఉన్నాయి.

వివరాలు 

ఆరోపణలపై ఎయిరిండియా క్లారిటీ 

ముఖ్యంగా మృతి చెందిన వ్యక్తిపై దరఖాస్తుదారులు ఆర్థికంగా ఆధారపడి ఉన్నారా? అనే ప్రశ్న కూడా ఉండటం విచారకరం అని స్టీవర్ట్స్‌ సంస్థ ఆరోపించింది. ఈ విషయంలో తాము తీవ్ర అసంతృప్తికి గురయ్యామని, వెంటనే అప్పీల్‌ చేశామని తెలిపింది. ఇదే సమయంలో, ఆ వివరాలను ఇవ్వకపోతే పరిహారం చెల్లించబోదని ఎయిరిండియా చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఆరోపణలపై ఎయిరిండియా క్లారిటీ ఇస్తూ స్పందించింది. ''ఇవన్నీ అసత్యమైన ఆరోపణలు.మృతులతో దరఖాస్తుదారుల సంబంధాన్ని గుర్తించేందుకు మాత్రమే మేము ఆ ప్రశ్నావళిని పంపించాం. దీని ద్వారా తాత్కాలిక చెల్లింపులను సక్రమంగా అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి పరిహార ప్రక్రియల్లో కొన్ని విధివిధానాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. దాన్ని అందరూ అర్థం చేసుకోవాలి'' అని ఎయిరిండియా స్పష్టం చేసింది.

వివరాలు 

47 కుటుంబాలకు తాత్కాలిక చెల్లింపులు

అలాగే, బాధిత కుటుంబాలకు తాము కావలసినంత సమయం ఇస్తామని, అన్ని విధాలా వారి పక్కన నిలుస్తామని తెలిపింది. ఇప్పటివరకు 47 కుటుంబాలకు తాత్కాలిక చెల్లింపులు అందించామని ఎయిరిండియా వెల్లడించింది. జూన్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండగా, ఒక్కరిని తప్పించి మిగిలిన వారు అందరూ మృతిచెందారు.

వివరాలు 

రూ.25 లక్షల చొప్పున మధ్యంతర సాయం

ఈ ప్రయాణికులలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ పౌరులు, ఏడుగురు పోర్చుగల్‌ దేశస్థులు, ఒక కెనడా పౌరుడు ఉన్నట్టు ఎయిరిండియా పేర్కొంది. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు టాటా సన్స్‌ సంస్థ రూ.1 కోటి చొప్పున పరిహారం ప్రకటించింది. అదనంగా, తక్షణ ఆర్థిక అవసరాల కోసం రూ.25 లక్షల చొప్పున మధ్యంతర సాయం అందిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది.