ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు
ఐఐటీ-హైదరాబాద్ మరో ఘనత సాధించింది. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సహకారంతో స్వదేశీ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ వంతెనను పరిశోధన బృందం అభివృద్ధి చేసింది. ఐఐటీ-హైదరాబాద్‌లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలోని ప్రొఫెసర్ కె.వి.ఎల్. సుబ్రమణ్యం, అతని పరిశోధనా బృందం ఈ అధునాతన బ్రడ్జిని నిర్మించారు. కాంక్రీట్, ఉపబల వినియోగాన్ని తగ్గించడానికి ఫారమ్ ఆప్టిమైజేషన్‌ను అనుసరించి ఐఐటీ హైదరాబాద్‌లో ఈ వంతెనను రూపొందించారు. 'మెటీరియల్ ఫాలోస్ ఫోర్స్' అనే సిద్ధాంతాన్ని అనుసరించి దీన్ని అభివృద్ధి చేశారు.
'3డీ ప్రింటింగ్'తో నిర్మాణ రంగంలో అనూహ్య మార్పులు: ప్రొఫెసర్ సుబ్రమణ్యం
3డీ ప్రింటింగ్ సిస్టమ్ మెరిట్‌లను పూర్తిగా ప్రదర్శించడానికి ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ట్రాషన్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ అభివృద్ధి చేసింది. ఇండస్ట్రియల్ రోబోటిక్ ఆర్మ్ 3డి ప్రింటర్‌ని ఉపయోగించి, సింప్లిఫోర్జ్ ప్రింటింగ్ ఫెసిలిటీలో రెండు గంటల్లోనే సిద్దిపేటలోని చర్విత మెడోస్‌లో దీన్ని అసెంబుల్ చేశారు. ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ, 3డి కాంక్రీట్ ప్రింటింగ్ అనేది అభివృద్ధి చెందుతున్న సాంకేతికత అన్నారు. ఇది నిర్మాణ రంగంలో అనూహ్య మార్పులను తీసుకొస్తుందని చెప్పారు.