PM Modi : మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం : ప్రధాని మోదీ
కోల్‌కతాలోని అర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఇక పశ్చిమబెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర రాజయకీయ యుద్ధానికి దారి తీసింది. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ హెచ్చరించారు. ఇందు కోసం కఠిన చట్టాలను మరింత పటిష్టపరుస్తామన్నారు.
దోషులను ఎవరైనా సరే విడిచిపెట్టకూడదు
మహిళల భద్రత చాలా ముఖ్యమని, మహిళలపై జరిగే నేరాలు క్షమించరానివని, దోషులు ఎవరైనా సరే విడిచిపెట్టకూడదని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు మోదీ వివరించారు. మహారాష్ట్రలో జరిగిన లఖపతి దీదీ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. 2014 వరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.25,000 కోట్ల కంటే తక్కువ రుణాలిచ్చారని, కానీ గత 10 సంవత్సరాలలో రూ.9 లక్షల కోట్లు అందించారమని చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకోవడంలో మహిళల పాత్ర కీలకమని వెల్లడించారు.