Page Loader
Telangana Govt-CRISP: మంత్రి సీతక్కతో క్రిస్ప్ సెక్రటరీ భేటీ.. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న క్రిస్ప్
మంత్రి సీతక్కతో క్రిస్ప్ సెక్రటరీ భేటీ.. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న క్రిస్ప్

Telangana Govt-CRISP: మంత్రి సీతక్కతో క్రిస్ప్ సెక్రటరీ భేటీ.. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న క్రిస్ప్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2025
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెక్రటేరియట్‌లో మంత్రి సీతక్కను క్రిస్ప్ థింక్ ట్యాంక్ సంస్థ మెంబర్ సెక్రటరీ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్. సుబ్రమణ్యం కలిశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్య వ్యవస్థలు, మహిళా సాధికారత బలోపేతంపై విస్తృతంగా చర్చ జరిగింది. పేదరిక నిర్మూలన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు క్రిస్ప్ తన సిద్ధతను ప్రకటించింది. ఈ క్రమంలో, క్రిస్ప్ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. మంత్రి సీతక్క సమక్షంలో క్రిస్ప్ మెంబర్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, సీఆర్డీ డైరెక్టర్ సృజనలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

వివరాలు 

దేశవ్యాప్తంగా 14 రాష్ట్ర ప్రభుత్వాలతో పనిచేస్తున్న  క్రిస్ప్ 

ప్రస్తుతం క్రిస్ప్ సంస్థ దేశవ్యాప్తంగా 14 రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోంది. ఆయా రాష్ట్రాలకు ఉచిత సేవలను అందిస్తోంది. గ్రామ సభల నిర్వహణ, గ్రామ పంచాయతీలను ఆత్మనిర్భరంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించడం, అలాగే స్థానిక ప్రభుత్వాల్లో సంస్కరణలు తీసుకురావడం వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) సిద్ధం చేయాలని మంత్రి సీతక్క సూచించారు. స్థానిక ఎన్నికలు పూర్తయి, కొత్త పాలకమండలి ఏర్పడే నాటికి ఈ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.