Loading...
Cyclone Aqwan: ఏపీ వైపు అక్వాన్ తుపాను దూకుడు.. కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్!
ఏపీ వైపు అక్వాన్ తుపాను దూకుడు.. కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్!

Cyclone Aqwan: ఏపీ వైపు అక్వాన్ తుపాను దూకుడు.. కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్వాన్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌ తీరంవైపు దూసుకొస్తోంది. దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. బుధవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడనుంది. అనంతరం వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం సాయంత్రానికి మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.

వివరాలు

ప్రధాన నగరాలకు ఎంత దూరంలో ఉందంటే?

మంగళవారం రాత్రి నాటికి అక్వాన్ తుపాను చెన్నైకి 590 కి.మీ., మచిలీపట్నానికి 650 కి.మీ., విశాఖపట్నానికి 660 కి.మీ., ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ప్రస్తుతం సముద్రంలో గంటకు కేవలం 3 కి.మీ. వేగంతో నెమ్మదిగా కదులుతోంది.

శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ-విశాఖపట్నం మధ్య, ముఖ్యంగా కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

తీరం దాటే సమయంలో తుపాను కొంత బలహీనపడే అవకాశముందని తెలిపింది.

గంటకు 145 కి.మీ. వేగంతో పెనుగాలులు

తుపాను ప్రభావంతో బుధవారం గంటకు 100-120 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి. గురువారం ఈ వేగం గంటకు 145 కి.మీ. వరకు చేరుకునే అవకాశం ఉంది.

వివరాలు

కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

బుధవారం నుంచి కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయి.

నవంబర్ 19, 20 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

నవంబర్ 21న కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ADVERTISEMENT