ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు
బంగాళాఖాతంలో తుపాను ప్రభావం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే అకాల వర్షాలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు మోచా తుపాను కారణంగా మరో నాలుగు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా కదులుతోంది. అది బుధవారం సాయంత్రానికల్లా తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో అది రేపటి మరింత బలపడి, ఎల్లుండి నాటికి తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ఆదివారం మధ్యాహ్నం నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
తెలంగాణలో 40కిలోమీటర్ల వేగంతో గాలులు
తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలపై పడే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. అలాగే తెలంగాణలో కూడా తుపాను కారణంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తుపాను బలపడతున్న క్రమంలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతవరణ శాఖ- హైదరాబాద్ హెచ్చరింంచింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 40కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అందుకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.