Cyclone Montha: మొంథా తుపాన్ బీభత్సం.. 75వేల మంది పునరావాస కేంద్రాలకు!
ఈ వార్తాకథనం ఏంటి
కోస్తాంధ్ర తీరానికి సమీపిస్తున్న మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తతతో ముందస్తు చర్యలు చేపట్టింది. తీవ్ర తుపాన్‌గా మారిన మొంథా, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని విశాఖపట్నం, ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 403 మండలాలు మొంథా ప్రభావ పరిధిలోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో 488 కంట్రోల్ రూమ్‌లను మండలాల వారీగా ఏర్పాటు చేసింది. అదనంగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 1,204 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి, ఇప్పటికే 75,802 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Details
219 మెడికల్ క్యాంపులు ఏర్పాటు
ప్రజల ఆరోగ్య అవసరాల కోసం 219 మెడికల్ క్యాంపులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అత్యవసర సమాచార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం 81 వైర్‌లెస్ టవర్లను ఏర్పాటు చేయగా, తుపాను సమయంలో ఉపయోగపడేలా 21 భారీ ఆస్కా ల్యాంపులు సిద్ధంగా ఉంచింది. రోడ్లపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు తొలగించేందుకు 1,147 జేసీబీలు, ప్రోక్లెయిన్లు, క్రేన్లు, అలాగే 321 డ్రోన్లను సైతం సిద్ధంగా ఉంచారు. అదనంగా, మెకానికల్ క్లీరెన్స్ కోసం 1,040 యాంత్రిక రంపాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. తుపాను తీవ్రత, వర్షాల ప్రభావంపై ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడానికి ప్రభుత్వం 3.6 కోట్ల మందికి పైగా మొబైల్ ఫోన్ల ద్వారా సందేశాలు పంపింది.
Details
38వేల హెక్టార్లలో పంట నష్టం
పశువుల సంరక్షణ దృష్ట్యా 865 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని అధికారులు నిల్వ ఉంచారు. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 38 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. అలాగే 1.38 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు. వర్షపాతం వివరాల ప్రకారం, ఉదయం 8.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నెల్లూరు జిల్లా ఉలవపాడులో 12.6 సెంటీమీటర్లు, సింగరాయకొండలో 10.5 సెంటీమీటర్లు, కావలిలో 12.2 సెంటీమీటర్లు, దగదర్తిలో 12 సెంటీమీటర్లు, బి.కోడూరులో 6 సెంటీమీటర్లు, కళింగపట్నంలో 7 సెంటీమీటర్లు, విశాఖపట్నం, తునిలో తలా 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.