Cyclone Montha: మూడు రోజుల వేట నిషేధం: వాతావరణ కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
'మొంథా' తీవ్ర తుపాను ప్రభావంతో రాష్ట్రంలో విస్తార ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో గణనీయమైన వర్షపాతం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే సూచనలున్నాయని హెచ్చరించారు. అలాగే కొండ ప్రాంతాల్లో కొండచరియలు జారిపడే ప్రమాదం ఉందని చెప్పారు. మత్స్యకారులు వచ్చే మూడు రోజుల పాటు సముద్ర వేటకు వెళ్లకూడదని సూచించారు. ప్రస్తుతం కాకినాడలో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, విశాఖపట్నం, గంగవరంలో 9వ నంబర్, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 8వ నంబర్ హెచ్చరికలు జారీ చేసినట్టు వివరించారు.
వివరాలు
కాకినాడకు 150 కి.మీ దూరంలో మొంథా తీవ్ర తుపాను
ఈ రోజు సాయంత్రం నుంచి రాత్రి లోగా 'మొంథా' తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉందని, తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం తుపాను కాకినాడ తీరానికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. తీరాన్ని తాకిన తర్వాత దాని ప్రభావం సుమారు గంటన్నరపాటు కొనసాగుతుందని చెప్పారు. వాతావరణ పరిస్థితులపై నిరంతర బులెటిన్లు అందిస్తామని కూడా ఆయన తెలిపారు.