Page Loader
AP Rains : బంగాళాఖాతంలో తుఫాన్.. ఇక ఏపీలో వానలే వానలు!
బంగాళాఖాతంలో తుఫాన్.. ఇక ఏపీలో వానలే వానలు!

AP Rains : బంగాళాఖాతంలో తుఫాన్.. ఇక ఏపీలో వానలే వానలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2023
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్కుపోత దెబ్బకు అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి వార్త అందింది. మళ్లీ ఏపీలో వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అండమాన్ సముద్రానికి అనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్రమట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా కదులుతోందని, ఈ నెల 20 నాటికి బంగళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా బలపడే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడ్రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Details

ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశాలకు తుఫాన్ గండం

రాబోయే మూడ్రోజుల్లో కోస్తాంద్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, రేపటికి అల్పపీడనంగా మారనుంది. ఆ తర్వాత వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా మారితే ఈనెల 25 నాటికి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశాలకు తుఫాన్ గండం పొంచి ఉంటుంది.