Daikin: ఏపీలో జపాన్‌కు చెందిన డైకిన్ రూ.1,000 కోట్ల పెట్టుబడులు
జపాన్‌కు చెందిన ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేషన్ పరికరాల తయారీ సంస్థ డైకిన్ ఇండస్ట్రీస్, రూ.1,000 కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో కంప్రెసర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఈ యూనిట్‌ను తైవాన్‌కు చెందిన రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో ప్రారంభించనున్నారు. డైకిన్ ఇండియా, రెచి ప్రెసిషన్ కలిసి ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీల కోసం అవసరమైన రోటరీ కంప్రెసర్లను తయారుచేసి, కొన్ని విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో డైకిన్ మెజారిటీ వాటాదారుగా ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ పెట్టుబడుల ప్రతిపాదన అమలులోకి రానుంది.
2030 నాటికి యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 మిలియన్ యూనిట్లకు పెంచాలని లక్ష్యం
శ్రీసిటీలో నిర్మించబోయే ఈ యూనిట్‌తో కలిపి, డైకిన్ దేశంలో మొత్తం మూడు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసినట్లవుతుంది. 75 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ కర్మాగారం ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద యూనిట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం దేశీయంగా 2 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగిన డైకిన్, 2030 నాటికి ఈ సామర్థ్యాన్ని 5 మిలియన్ యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ మార్కెట్‌లో ఏసీ విక్రయాల్లో మెజారిటీ వాటా సాధించడమే తమ ముఖ్య లక్ష్యమని డైకిన్ స్పష్టం చేసింది. అలాగే, ఈ ఒప్పందం ద్వారా మధ్యతరగతి ప్రజలకు చౌక ధరల వద్ద ఏసీలను అందించడం సాధ్యమవుతుందని కూడా సంస్థ ప్రకటనలో పేర్కొంది.