Page Loader
Article 370: ఆర్టికల్ 370 పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టులో విచారణ 
ఆర్టికల్ 370 పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టులో విచారణ

Article 370: ఆర్టికల్ 370 పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టులో విచారణ 

వ్రాసిన వారు Stalin
Jul 11, 2023
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డివై చంద్రచూడ్‌, జస్టిస్ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. అయితే సోమవారం, శుక్రవారాలు మినహా రోజువారీ ప్రాతిపదికన ఆర్టికల్ 370 పిటిషన్లపై విచారణ ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఆగస్టు 2 (బుధవారం) ఉదయం 10:30 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఆగస్టు 5, 2019న రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేశారు.

సుప్రీంకోర్టు

ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 23 పిటిషన్లు 

రాష్ట్రపతి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మొత్తం 23 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఆర్టికల్ 370 పిటిషన్లపై విచారణ నేపథ్యంలో జులై 25లోగా ఆన్‌లైన్ మోడ్‌లో అన్ని పార్టీలు తమ ప్రతిస్పందనలను తెలియజేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కోరింది. ఈ అంశానికి సంబంధించిన అన్ని ఫైళ్లు, పత్రాలను పేపర్‌లెస్ మోడ్‌లో సమర్పించాలని ధర్మాసనం పేర్కొంది. ఇదిలా ఉంటే, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సమర్ధిస్తూ కేంద్రం సోమవారం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అయితే విచారణ సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో పరిస్థితికి సంబంధించి కేంద్రం దాఖలు చేసిన తాజా అఫిడవిట్‌ను విచారించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగపరమైన అంశాలపై మాత్రమే విచారణ జరుపుతామని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.