Page Loader
Cyclone Dana: దానా తుపాన్‌ ఎఫెక్ట్.. రైళ్లను రద్దు చేస్తూ సౌత్‌ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం 
దానా తుపాన్‌ ఎఫెక్ట్.. రైళ్లను రద్దు చేస్తూ సౌత్‌ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం

Cyclone Dana: దానా తుపాన్‌ ఎఫెక్ట్.. రైళ్లను రద్దు చేస్తూ సౌత్‌ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2024
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్లకల్లోలం మరింత ఉధృతమవుతోంది. దానా తుఫాన్ రేపు తీరం దాటనుందని వాతావరణ శాఖ పేర్కొంది. పూరీ (ఒడిశా) నుంచి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ఐలాండ్‌ మధ్య తీరం దాటుతుందని, ఈ సమయంలో గంటకు 120 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నికోబార్‌ దీవుల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా, ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాలపై ఈ తుఫాన్‌ మరింత ప్రభావం చూపుతుందని తెలిపింది. తుపాన్ ప్రభావంతో నేటి నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

Details

భారీ వర్షాలు పడే అవకాశం

ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో ఎల్లో వార్నింగ్‌ ప్రకటించడంతో పాటు భద్రక్, బాలాసోర్, కటక్, పూరీ తదితర జిల్లాల్లో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోన్న అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, హౌరా, హుగ్లీలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇక తుపాన్‌ కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు. అనకాపల్లి జిల్లాపైనా తుఫాన్‌ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున అక్కడి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు.

Details

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

రేపటి నుంచి 26వ తేదీ వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. దానా తుఫాన్‌ కారణంగా రైలు సర్వీసులపై కూడా ప్రభావం పడింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి మొత్తం 41 రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్-భువనేశ్వర్‌, చెన్నై సెంట్రల్-షాలిమార్‌, ముంబై-భువనేశ్వర్‌ కోణార్క్‌, బెంగళూరు-హౌరా రైళ్లు రద్దు చేసినవాటిలో ఉన్నాయి. మొత్తం 198 రైలు సర్వీసులను ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే రద్దు చేసింది.