Mysuru: మైసూర్ ప్యాలెస్‌లో ప్రారంభమైన దసరా ఉత్సవాలు.. ప్రైవేట్ దర్బార్ నిర్వహించిన యదువీర్
విఖ్యాత దసరా ఉత్సవాల సందర్భంగా రాజవంశాధికారి యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయరు రత్నఖచిత సింహాసనాన్ని అధిష్ఠించి గురువారం జరిగిన ప్రైవేటు దర్బారు ఘట్టం అద్భుతంగా సాగింది. ఇది వరుసగా పదో ఏడాది ఆయన దర్బారు నిర్వహించడం. ఈసారి, మైసూరు-కొడగు ఎంపీగా తొలిసారి పూజల్లో పాల్గొన్నారు. రాజమాత ప్రమోదాదేవి ఆశీర్వాదాలు తీసుకున్న యదువీర్, వందిమాగధుల నినాదాల నడుమ ప్యాలెస్‌లోకి అడుగుపెట్టారు. ఆయన లేత నేరేడు రంగు మైసూరు తలపాగా,పట్టు కుర్తా, పైజామాతో పాటు వంశపారంపర్యంగా వచ్చిన ముత్యాలు,మణులతో పొదిగిన ఆభరణాలు ధరించారు. ఉదయం 11.35కి ప్యాలెస్ ఆవరణలోకి చేరుకున్న యదువీర్,12.05 వరకు పూజలు నిర్వహించి రత్నఖచిత సింహాసనాన్ని అధిష్ఠించారు. దర్బార్ హాల్‌లో నవగ్రహ పూజలు,సింహం ముఖ లాంఛనం,కలశాలకు పూలు, అక్షితలు చల్లుతూ మంగళహారతి నిర్వహించారు.
విజయదశమి వరకు యదువీర్ ప్రైవేటు దర్బారు
సింహాసనం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత దాన్ని అధిరోహించి, సిబ్బందుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సమయంలో కర్ణాటక పోలీసు బ్యాండ్ సిబ్బంది 'కాయో శ్రీ గౌరీ' గీతాన్ని వాయించగా, అనంతరం శ్రీమహాగణపతీం, చాముండేశ్వరి వంటి భక్తి గీతాలు కూడా ఆలపించారు. యదువీర్ సుమారు అరగంట సింహాసనంపై కూర్చుని ప్రైవేటు దర్బారును నిర్వహించారు. పరకాల మఠం, చాముండి బెట్ట, శ్రీరంగపట్టణ వంటి ప్రముఖ దేవాలయాల నుంచి వచ్చిన ప్రసాదాన్ని స్వీకరించారు. దర్బారు ముగింపు సందర్భంగా సహకారం అందించిన వారికి యదువీర్ చిరు కానుకలను అందించారు. విజయదశమి వరకు యదువీర్ ప్రతిరోజూ కొంత సమయం ప్రైవేటు దర్బారును నిర్వహిస్తారు.